News

అల్ ఫలాహ్ యూనివర్సిటీని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

89views

ఇస్లామిక్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువైన ఫరీదాబాద్ అల్ ఫలాహ యూనివర్సిటీని హర్యానా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసేసుకుంది. ఈ ప్రైవేట్ సంస్థలో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు, ఆర్థిక అవకతవకలు జరిగినట్లు విచారణలో బట్టబయలైంది. ఈ నేపథ్యంలోనే హర్యానా సర్కార్ ఈ యూనివర్సిటీని తన ఆధీనంలోకి తీసుకుంది.

ఈ మొత్తం వ్యవహారాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి అమిత్ కుమార్ అగర్వాల్ పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయం పరిపాలనా, ఆర్థిక వ్యవహారాలను సమీక్షించే బాధ్యత ప్రభుత్వం ఈయనకే అప్పగించింది. సుమారు 1,700 మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటూనే, ఈ సంస్థను స్థిరీకరించడానికి ఈ చర్య అవసరమని అధికారులు తెలిపారు.

చట్టబద్ధమైన నిబంధనలను అనేక రకాలుగా ఉల్లంఘించారని విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నియంత్రణా లోపాలు, పరిపాలనలో అవకతవకలు కూడా వున్నాయని నిర్ధారణ అయ్యింది.

2013 లో అల్ ఫలాహ్ యూనివర్సిటీగా అయ్యింది. అయినా సరే అక్రిడేషన్ పొందలేదు. దీంతో విద్యా ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. గతంలోని నియంత్రణ లోపాల వల్లే ఈ సమస్యలు కొనసాగాయని, అందువల్ల మరింత పటిష్టమైన పర్యవేక్షణ, దిద్దుబాటు చర్యలు అవసరమయ్యాయని అధికారులు భావిస్తున్నారు.

2025 నవంబర్‌లో జరిగిన ఎర్రకోట పేలుడుతో విశ్వవిద్యాలయానికి సంబంధాలున్నాయన్న ఆరోపణలు రావడంతో ఈ యూనివర్సిటీపై అందరి కళ్లూ పడ్డాయి. 2025 నవంబర్‌లో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన తీవ్రమైన పేలుడులో కనీసం 15 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై జరిపిన దర్యాప్తులో, హర్యానా, ఉత్తర ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్‌తో సహా పలు రాష్ట్రాలకు విస్తరించి ఉన్న ఒక “వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్” ఉన్నట్లు ఏజెన్సీలు వెల్లడించాయి.

ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ, విశ్వవిద్యాలయం యొక్క వైద్య కళాశాలలో సహాయ ఆచార్యుడు అని నిర్ధారణ అయ్యింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో సంబంధమున్న డాక్టర్ ముజ్జమిల్ షకీల్, డాక్టర్ షాహీన్ షాహిద్ కూడా ఈ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు.ఈ నెట్‌వర్క్‌కు జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని సమాచారం.

మోసం, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 19 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధిఖీని అరెస్టు అరెస్ట్ చేసింది. సిద్ధిఖీని ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా, నాలుగు రోజుల పాటు పోలీసు రిమాండ్ కి పంపారు. యూజీసీ ఫిర్యాదు ఆధారంగా సిద్దిఖీపై క్రైమ్ బ్రాంచీ రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ లను నమోదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రధానంగా మోసం, అక్రమ ఆర్ధిక కార్యకలాపాలపైనే ఈ అరెస్ట్ జరిగిందని అంటున్నారు.