
103views
భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అది సముద్రాలు దాటి సుదూర దేశాలకు విస్తరించిందని చెప్పడానికి ఫిలిప్పీన్స్‌లో దొరికిన తాజా ఆధారాలు నిదర్శనంగా చెప్పవచ్చు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పరిశోధకుడు సయ్యద్ షమీర్ హుస్సేన్ ఫిలిప్పీన్స్‌లోని ఒక మైనింగ్ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆయుధమైన త్రిశూలం , ఇంద్రుడి ఆయుధమైన వజ్రాయుధాన్ని పోలిన ఒక ఆయుధం బయటపడ్డాయి. తవ్వకాలలో బయటపడిన త్రిశూలంసుమారు 10,000 ఏళ్ల నాటిదిగా భావిస్తున్నారు. భూమికి 20 అడుగుల లోతులో లభించిన ఈ త్రిశూలం, ఆ కాలంలోనే అక్కడ శైవారాధన లేదా భారతీయ సంస్కృతి ప్రభావం ఉందని సూచిస్తోంది. ఇక మరోటి వజ్రాయుధం. సుమారు 3,000 ఏళ్లు పురాతనమైనది అంచనా. పురాణాల్లో ఇంద్రుడి శక్తివంతమైన ఆయుధంగా వర్ణించబడే వజ్రాయుధం ఆకృతిలో ఇది ఉండటం గమనార్హం.
ఫిలిప్పీన్స్‌లోని పాలవాన్ దీవిలో గతంలోనే ఒక అరుదైన బంగారు గరుడ విగ్రహం లభించింది. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి రూపంలో ఉన్న ఈ విగ్రహం, హిందూ పురాణాలతో ఫిలిప్పీన్స్‌కు ఉన్న సంబంధాన్ని బలపరుస్తోంది. అలాగే, అగుసాన్ నదిలో లభించిన ‘గోల్డెన్ తార’ (21 క్యారెట్ల బంగారు బుద్ధ/దేవత ప్రతిమ) ఆగ్నేయాసియాలో హిందూ-బౌద్ధ నాగరికతల ఉనికికి నిలువుటద్దంగా నిలుస్తోంది.
ఈ అరుదైన చిహ్నాలను భారత పురావస్తు శాఖ (ASI) , ఇతర సాంస్కృతిక సంస్థలు గుర్తించాయి. ఈ చారిత్రక సంపదను కాపాడటంతో పాటు, సామాజిక సేవ కోసం వీటిని జూన్ 10న వేలం వేయనున్నట్లు హుస్సేన్ ప్రకటించారు. త్రిశూలానికి రూ. 500 కోట్లు, వజ్రాయుధానికి రూ. 250 కోట్లు కనీస ధరగా నిర్ణయించారు. ఈ నిధులను అనాథ పిల్లల విద్య మరియు సంక్షేమం కోసం వెచ్చించనున్నారు.





