ArticlesNews

షహీద్ దివస్ : త్యాగ వీరులకు సెల్యూట్

98views

( మార్చి 23 – భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల బలిదానం )

భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల అమర త్యాగాలకు దేశం గర్విస్తోంది. భరతమాతను దాస్యశృంఖ‌లాల‌ నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసిన ఆ ముగ్గురు వీరులను నాటి వలస పాలకులు అన్యాయంగా ఉరికంబం ఎక్కించారు. చిన్న వయసులోనే ఆ ముగ్గురు వీరులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఉరిని కూడా ఆనందంగా స్వీకరించి బలిదానం చేసిన రోజు మార్చి 23. ఆ వీరులు ప్రాణత్యాగం చేసిన నాటి రోజునే వారి జ్ఞాపకార్ధం షహీద్ దివస్‌గా జరుపుకుంటున్నాం.

బ్రిటిష్ పాలన అంతంకావాలని పరాయి పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురు వీరులు నాటి తరానికే కాదు, నేటి యువతకు కూడా ఆదర్శం. ఉరికంబం ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వని ఈ యోధులు, చావును కూడా ఎంతో ఆనందంగా స్వీకరించారు. 1931 మార్చి 23న ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ హుస్సైన్‌వాలా ప్రావిన్స్‌ జైల్లో ఈ వీరులను ఉరికంబానికి బలిచ్చారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాడును ముద్దాడి భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లు, ప్రాణత్యాగం చేశారు. నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలులో లేదు, అందుకే వారి మృత దేహాలను జైలు వెనుక గోడలు పగులగొట్టి రహస్యంగా తీసుకెళ్లి సట్లెజ్ నది తీరాన దహనం చేశారు. మృతదేహాలు ప్రజల కంటబడితే ఉపద్రవం ముంచుకొస్తుందనే ఇలా చేశారు.

భగత్ సింగ్ 1907 సెప్టెంబరు 28న పంజాబ్‌లోని లియాల్‌పూర్‌లో జన్మించారు. బాల్యం నుండే జాతీయ ఉద్యమానికి ఆకర్షితుడైన భగత్‌ సింగ్‌ బ్రిటిష్ వారిపై తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేసేవాడు. స్వాతంత్ర్య సాధనకు అహింసా మార్గం ఒ‍క్కటే సరిపోదని, విప్లవాత్మక కార్యకలాపాలు కూడా అవసరమని భగత్ సింగ్ నమ్మాడు. భగత్ సింగ్ బ్రిటిష్ పాలను వ్యతిరేకిస్తూ 1929లో ఢిల్లీ అసెంబ్లీలో బాంబు విసిరారు. దీని లక్ష్యం ఎవరినీ చంపడం కాదు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే అలా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భగత్‌సింగ్‌తో పాటు అతని అనుచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను అరెస్ట్ చేశారు. తరువాత వారిని కోర్టుకు తరలించగా అక్కడివారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం వారు ఉరిశిక్షను ఆనందంగా ఎదుర్కొన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు.

భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల బలిదానం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశానిర్దేశం చేసింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. బ్రిటిష్ చీకటి సామ్రాజ్యం నుంచి భారత దేశానికి స్వేచ్ఛ స్వాతంత్య్రపు క్రాంతి విరజిమ్మిందంటే వీరి ప్రాణ త్యాగమే అందుకు కారణం. ఈ యువకిశోరాల త్యాగం ఎప్పటికీ వృధా కాదు. అమరవీరుల్లారా, ఎల్లవేళలా మీరు ప్రతి భారతీయ గుండెల్లో ఉంటారు.