ArticlesNews

ఆ ‌క‘వన’నాలలో కనిపించేది మా జీ‘వనమే!’

123views

‌రామాయణం, భారతం.. ఇవి భారతీయ సమాజానికి జాతీయ కావ్యాలు. ఇవి శతాబ్దాలుగా భారతజాతిని ఉత్తేజితం చేస్తున్నాయి, మార్గదర్శనం చేస్తున్నాయి. కుటుంబ విలువలు, నైతిక విలువలను బోధిస్తున్నాయి. భారతదేశంలోనే 300 పైగా రామాయణాలు ఉన్నాయని ఇదివరకు అభిప్రాయపడేవారు. కానీ అయోధ్యలో రామాయణ అధ్యయన కేంద్రం స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 2000 వరకు రామాయణాలు ఉన్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది.భారతం ఎన్నో ప్రపంచ భాషల్లోకి వెళ్లింది. కొత్తగా మహాభారతం, రామాయణంలో సుందరకాండ- ఈ రెండూ గోండి భాషలో లిఖితరూపంలో వచ్చాయి. ఆ పని చేసినవారు ఉపాధ్యాయులు, గోండు సమాజ భాషాభిమాని, తొడిసం కైలాస్‌. ఆ ‌రెండు గ్రంథాల గురించి, ఆ కావ్యాలు గిరిపుత్రులకు అందించిన వారసత్వం గురించి, వాటి రచనకు వారిని ప్రేరేపించిన అంశాల గురించి తెలుసుకుందాం.

మహాభారతం రాశారు. ఇది గోండు భాష మీద అభిమానంతో రాశారా? భారతీయుల మహా కవనం కాబట్టి, మహాకావ్యం కాబట్టి, జాతీయ కావ్యం కూడా కాబట్టి ఆ అభిమానంతో రాశారా?
గోండు భాష పైన అభిమానం ఒకటి. మహా భారతంలోని మధురమైన ఆ కథలూ ప్రేరేపించాయి. వాటిని నాటకాల రూపంలో, టీవీ ధారావాహికలలో చిన్నప్పటి నుండి చూశాను. ఇంత మధురమైన కథను మా గోండు భాషలో రాస్తే బాగుండునన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాను. కానీ ఇంత పెద్ద పుస్తకాన్ని నేను పూర్తి చేయగలనా? మా భాషలో అన్ని పదాలు ఉన్నాయా? అన్న అనుమానం ఉంది. అయినా ప్రయత్నం చేశాను. విజయం సాధించాననే అనుకుంటున్నాను.

రామాయణం, భారతం- రెండూ ఆవిర్భవించినది వన ప్రాంతాలలో. భారతంలో ఒక గుహలో. రామా యణం తపోభూమిలో. ఆ ఇతివృత్తాలకు నేపథ్యంగా ఇంచుమించుగా 50% అడవే కనిపిస్తుంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది?
వాళ్లు కేవలం 14 సంవత్సరాలే వనవాసం చేశారు. కానీ మేం జీవితాంతం వనవాసం చేస్తాం. జీవితమే వనం, అంతే. మా గోండు పల్లెలు అటవీ ప్రాంతంలోనే ఉంటాయి. మా జీవన విధానాన్ని ఆ కావ్యాలు బయటి ప్రపంచానికి అందించాయని అనుకుంటున్నాను. రామాయణం, భారతం రెండూ అడవులలోనే ఎక్కువ జరుగుతాయి. అందుకేనేమో, ఆ కథలను తెరల మీద, రంగస్థలం మీద చూసే టప్పుడు, చదివేటప్పుడు, వినేటప్పుడు మేము లీనమయిపోయేవాళ్లం. వారి జీవన విధానం అచ్చంగా మాదే. అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నది. ఆ అడవుల గుండా వారు వెళ్లడం, అందుకు పడిన కష్టాలు మీరైతే ఈ కథలతో తెలుసుకున్నారు. కానీ మాకైతే అది నిజ జీవితం. పుట్టుక నుంచి చావు వరకు మాకు అడవులతో బంధమే. అడవితోనే మా సహవాసం. అడవిలో పెరిగాం. ప్రతి చెట్టు, ప్రతి పుట్ట తెలుసు. ప్రతి పురుగు గురించి తెలుసు, ప్రతి జంతువు గురించి మాకు తెలుసు.

వనవాస జీవిత వర్ణనకు సంబంధించి మిమ్నల్ని బాగా ఆకర్షించేది రామాయణమా, మహా భారతమా? అలాగే మహాభారతంలో ఉన్న వనవాసి జీవితం రామాయణంలోని వనవాసి జీవితం మధ్య ఏమైనా తేడా ఉందా?
రెండూ నన్ను ఆకర్షించాయి. రామకథ త్రేతాయుగం. భారతం ద్వాపర యుగంలో జరిగింది. రెండూ నాకు ఒకేలా ఉన్నాయి. కాకపోతే భారతంలో పాండవులు మాత్రమే ఉంటారు. రామాయణంలో వానరవీరులు ఉంటారు. ముఖ్యంగా హనుమంతుడు ఉంటాడు.

ఇప్పటికే సుందరకాండ రాసి ఉండొచ్చు. మీరు మొత్తం రామాయణం అంతా బాగా చదువుకుని ఉంటారు. శబరి పాత్ర ఉంది. భిలని అంటారు. భిల్లు జాతి మహిళ. గుహుడు నిషాదుడు. శబరి మాతంగ మహామునిని గురువుగా భావించింది. ఈ రెండు పాత్రలని మీరు ఎలా చూశారు?
నాకు తెలిసిన శబరి తను తిన్న పండుని రామునికి ఇస్తుంది. అంటే అది ఎంగిలని కాదు. ఆ పండు రుచి కరంగా ఉందా? లేదా? లేక విషపూరితమా? లేకపోతే అది తినేటట్టు ఉన్నదా? ఇవన్నీ ఎంగిలితో పరీక్షించి ఇచ్చింది. ఇప్పుడు మా దగ్గర కూడా మా ఇంటికి వచ్చిన వాళ్లు సంతృప్తి చెంది వెళ్లాలి అని అనుకుంటాం. అందుకు వండిన వాటిని కాస్త చేతిలో వేసుకుని రుచి చూస్తారు.

భారతంలో ఏకలవ్యుడి పాత్ర గురించి ఏమంటారు?
ఏకలవ్యుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తే శిష్యునిగా చేర్చుకోవడానికి నిరాకరించాడు. అతను ఒక ఆదివాసి అని అనుకొని ఉండవచ్చు. లేదంటే అర్జునుని గొప్పవాడిని చేయాలనుకోవడానికే ఏకలవ్యుడిని కాదని ఉండవచ్చు. ఒక గురువు నిరాకరించాడని నిరాశ చెందకుండా పట్టుదలతో, స్వయంకృషితో విలువిద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడినే గురువుగా భావిస్తూ విద్య నేర్చుకున్నాడు. నేను సంగీతం అలాగే నేర్చుకున్నాను. నన్ను ఎవరూ కాదనలేదనుకోండి! •శీబ•బవలో కొందరు గురువులు దొరికారు. నెట్‌ ‌నుండి కొన్ని స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు ఇవన్నీ నేను స్వయంగా బాగా అభ్యాసం చేసి ఫింగర్‌ ఎక్సర్సైజ్‌ ‌చేసి ఇప్పుడు పాటలు కూడా వాయిస్తున్నాను. నేను చాలా తొందరగానే కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను.

ఇప్పటికే వనవాసి భాషలకి చాలా వాటికి లిపి లేదు. గిడుగు రామమూర్తి గారు కొంత ప్రయత్నం చేశారు. అది వేరే సంగతి. మీరు చేసినట్టే భారతం, రామాయణం వంటి కావ్యాల్ని ఇతర గిరిజన భాషలలోకి, ఇతర భాషల లిపిలో రాసుకున్న సందర్భాలు ఉన్నాయా?
నార్మిల్‌ ‌మండలం, గుంజాల గ్రామంలో గోండి లిపిగా నమ్ముతున్న లిపి బయటపడింది. దాని పైన అధ్యయనం చేస్తున్నారు. కొన్ని గోండి భాషా పదాలు తెలుగులో పలకవు. హిందీలో రాసినా అంతే. గోండిలో అంగి అంటాం ఆణి అంటాం. ఆంగి కాదు ఆణి అంటాం. కాని నేను ఏం చేశానంటే రాసినదాన్ని కొన్ని యాప్స్ ఉపయోగించి వాయిస్‌గా మార్చాను. వాటిని నా •శీబ•బవ ఛానల్‌లో పెడితే మంచి స్పందన వచ్చింది. అందుకే వార్తలు కూడా చేశాను. ఈ మధ్యనే ఈ సుందరకాండ మొత్తాన్ని నేను రాస్తే, మా అబ్బాయి సృజన్‌ ‌రామ్‌ ‌సాంగ్స్‌గా మార్చాడు. ఒక్కొక్క పాట ఎనిమిది నిమిషాల నిడివి.

పాట.. మాట చూస్తే వనవాసులలో పాటకు చాలా ప్రాధాన్యం ఉంటుంది కదా! ఎక్కువ మీ కావ్యాలు, మీ స్థానిక గాథలు పాటల రూపంలోనే ఉంటాయి.
అవును, ఊయలలూపే దశ నుంచి మొదలై, పొలంలో, ప్రతి సందర్బంలోను పాట ఉంటుంది. మా చిన్నప్పుడు ఏడురోజుల పెండ్లి ఉండేది. ఆ ఏడు రోజులు అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడైతే పెండ్లి రెండురోజులలో ముగిస్తున్నారు, అయినా మొదటిరోజు నుంచి, చివరిరోజు వరకు పాటకు ప్రాధాన్యం ఉంది. నూతన వధువు కొత్త ఇంట్లో అలవాటు కావడానికి అనేక రకాల ఆటలు ఉంటాయి. ఆ ఆటల్లోనూ పాటే ఉంటుంది. పుట్టింటిని మరిపించడానికి ఇక్కడ అనేక రకాల ఆటలు ఉంటాయి. వదినలు, మరదళ్లు అందరూ ఆట పట్టించడం అందులో భాగమే. చావు కూడా పాటలతోనే ముగుస్తుంది. పితృ కార్యక్రమం చేస్తాం. కీకిరి వాయిద్యాలు వాయించి, రాత్రంతా పాటలు పాడితే ఆయన ఏ జన్మలోకి వెళ్లారో ఆ పాదముద్ర అక్కడ పెట్టిన పిండిలో పడుతుంది. ఇప్పుడు కూడా ఈ ఆచారం ఉంది.

కానీ మీరు మహాభారతం వచనంలో రాశారు. కారణం ఏమిటి?
భాషను బ్రతికించడానికి వచనంలో రాశాను. మా భాషలో కనుమరుగయ్యే పదాలను కాపాడాలన్న ఉద్దేశం కూడా ఉంది. భవిష్యత్తులో పాటల రూపంలో కూడా రాస్తాను. దానికంటే మొదలు నేను ‘పేనుకు’ అనే పుస్తకం రాశాను. అంటే మా కథ. అది రాశాకనే నా రచన మెరుగైంది. పరిపక్వత సాధించాను. తర్వాత సందేహాలు రావడంతో దాన్ని పక్కన పెట్టాను. మహాభారతం రాశాను. దాని తర్వాత పాటలు రాశాను. ఏఐ టెక్నాలజీ రావడంతో బాణీకి లిరిక్స్ ‌రాయడం కూడా వచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కిబాత్‌లో మీ కృషి గురించి ప్రస్తావించినప్పుడు ఎలా అనిపించింది?
గౌరవ ప్రధాని మోదీ నా పాటలను ప్రశంసిం చడం చాలా సంతోషం. గతంలో కొంత కవిత్వం రాశాను, యువతకు ప్రేరణ ఇవ్వడానికి. తర్వాత 2024లో ఐఏ టెక్నాలజీ రావడం, రాసినదాన్ని పాటలుగా మార్చే టెక్నాలజీ కూడా వచ్చాయి. అలా100 పాటలు చేశాను. ఆ తరువాతే మోదీ నుంచి ప్రశంస అందింది. ఫ్రాన్స్‌లో ప్రపంచస్థాయి ఏఐ సెమినార్‌కు వెళ్లారాయన. అక్కడ ఏఐతో వివిధ దేశాల వాళ్లు చేసిన అద్భుతాలను చూశారు. ఇక మన దేశంలో ఏఐని ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నారో వాకబు చేశారు. సమాచార శాఖ ఆ వివరాలు సేకరించే పనిలో ఉండగా, నా విషయం బయటకు వచ్చింది. నా గురించి ఇండియన్‌ ఎ‌క్స్‌ప్రెస్‌లో రాజారెడ్డిగారు రాసిన వ్యాసం వచ్చింది. అట్లా నా గురించి మోదీ గారికి తెలియడంతో, ఆదిలాబాద్‌ ‌గౌరవ కలెక్టర్‌ ‌రాజర్షి షా వాకబు చేశారు. నేను కూడా ఫలానా ఈ పరికరాలను ఉపయోగిస్తున్నట్టు చెప్పాను. పాటలతో పాటు గోండి భాషలో వార్తలు వెలువరించిన సంగతి కూడా చెప్పాను. ఆపై దూర దర్శన్‌ ‌వాళ్లు వచ్చారు. అప్పుడు నా గురించి మోదీ మన్‌కిబాత్‌లో మాట్లాడారు, ఫిబ్రవరి, 2025లో. మోడీ గారు నా గురించి ప్రస్తావించడంతో మా ఇంట్లో వాళ్లందరూ, మా ఊరు వాళ్లందరూ, మా జిల్లా వాళ్లందరూ ఆనందించారు. ఆ తర్వాత 79వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో గౌరవ రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొనే అవకాశం కూడా దక్కింది.

రామాయణ భారతాలలోని అడవి మీకు ఇష్టమే. మీరు పుట్టి పెరిగినదీ అడవే. కాబట్టి వనమూలికల గురించి తెలిసి ఉంటుంది. ఆనాటి వనమూలికలు ఈ రోజున కూడా ఉన్నట్టు మీ దృష్టికి వచ్చిందా? ఉంటే ఏ పేరుతో పిలుస్తున్నారు?
కందమూలాలు ఇప్పటికి అవే పేరుతో ఉన్నాయి. గడ్డలు అంటాం. ఇంగ్లీష్‌లో ట్యూబర్స్ అం‌టారు. చేదు పోయేదాకా బాగా ఉడకబెట్టి తింటారు. ఇప్పుడు మార్కెట్లో బియ్యం తీసుకొస్తాం. సరుకులు తీసుకొస్తాం. ఆ రోజుల్లో అడవికి వెళ్లి కందమూలాలు తీసుకొచ్చేవారు. ఇంట్లో కుప్పలు కుప్పలు ఉండేవి. పంటలు పండని సందర్భంలో, ముసురు పడ్డ సందర్భంలో పనులు దొరకవు. ఆ సందర్భంలో వీటిని తినేవారు. మస్తు మంచిగా ఉంటాయి. అడవికి వెళ్లినప్పుడు కొద్దిగానే నీళ్లు తీసుకెళ్తాం. అయిపో తాయి. సిర్మన్‌ ‌చెట్టు ఉంటుంది. దాని జిగురుని నోట్లో పెట్టుకుని నములుతూ ఎంత దూరమైనా వెళ్లవచ్చు. నోట్లో ఉన్నది కాగానే మరి కొంచెం వేసుకోవాలి. తేనె, ఇప్పపూవు తెలుసు కదా. ఇప్ప పువ్వుతో లడ్డులు చేస్తున్నారు. మా ఊర్లో, మా ఇంట్లో ఇప్పపువ్వు బూరెలు, ఇప్పపువ్వు గారెలు తింటాం. ఇప్పపువ్వు నూనె ఉంటుంది. తునికి పండ్లు, మొర్రి పండ్లు, బరుసు పండ్లు ఇప్పుడూ ఉంటాయి. రేని పండ్లు కూడా…

ఇవన్నీ భారతంలో కనిపిస్తాయి…
ఉన్నాయి. అడవిలో వెళుతుంటే ఏం దొరుకు తాయి? పండ్లు, రకరకాల పండ్లు దొరుకుతాయి. అడవిలో పంటలంటే పోడు వ్యవసాయం. రకరకాల జంతువులు సరేసరి. వీటి జాడ కావ్యాలలో ఉంది.

‘పండోక్న’ మహాభారత కథ అన్నారు పండోక్న అంటే?
మేం మహాభారతాన్ని పండోక్న కథ అంటాం. మీరు మహాభారతం అంటారు. మా దగ్గర ప్రాచుర్యంలో ఉన్న పేరు పండోక్న కథ. కాబట్టి భారతాన్ని గోండి భాషలో పండోక్న కథ అని పిలవాలి. సరే, మీరు మహా భారతం చదివారు, పండోక్న కథ రచించారు కదా! మహాభారతం, పండోక్న మీకు కరతలామలకం.

రెండింట్లోనూ ఏదైనా తేడాలు ఉన్నాయా? పాత్రలు, ఘటనలు వంటివి? పాండవులని ఏమని పిలుస్తారు?
పాండవులని పాండురాజ, పాండురాజ రాజన్న, మర్కు పాండురాజనూరు అంటాం. పాండవకు అంటాం.

పాండు నుంచి వచ్చిందా పండక్న?
పాండురాజు నుంచి వచ్చింది. పాండురాజు మంచివాడు కదా! మంచి చక్రవర్తి. అలుయ పాండుక అంటే పంచపాండవులు.

దుర్యోధనుడిని ఏ పేరుతో పిలుస్తారు?
దుర్యోధనల్‌

‌పాండువులు, కౌరవులు. రెండు వైపులా మీకు బాగా నచ్చిన పాత్రలేమిటి?
మహాభారతంలో నచ్చిన పాత్ర అంటే కర్ణుడు. చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇంకా విదురుడు, మంచి చెప్తాడు, నీతి బోధిస్తాడు. భీష్మాచార్య పాత్ర బాగుంటుంది. ద్రౌపదీ వస్త్రాపహరణం వేళ మాట్లాడలేకపోతాడు. ఎందుకు అంటే దుర్యోధనుడి ఉప్పు తిన్నాను కాబట్టి ఆయన మాట్లాడలేకపోతున్నా నని అంటాడు. అర్జునుని పాత్ర, ధర్మరాజు, భీముని పాత్రలూ బావుంటాయి.

కృష్ణ పరమాత్మని ఎలా చూస్తారు?
పరమాత్ముడే!

పండోక్న కథలో కూడా ఆ పేర్లే ఉంటాయి?
అర్జునల్‌, శ్రీ‌కృష్ణల్‌.. ఇలా!

సుందరకాండలో ఆంజనేయుడు పాత్రని మీరు ఎలాగ తీసుకున్నారు?
హనుమంతల్‌ అం‌టాం. ఆయనది చాలా మంచి ఆ కథ. రాముడు కోరిన సీత జాడ తెలుసుకోగలిగేది ఎవరో జాంబవంతునికి తెలుసు. ఎన్నో యోజనాల అవతల ఉన్న లంకా నగరం వెళ్లగలిగే శక్తి సామ ర్థ్యాలు ఆంజనేయునికి ఉన్నాయి. కాబట్టి హనుమంతుని పంపించారు. అంతకుముందు ఆయన శక్తిసామర్థ్యాలు తెలియవు. చిన్నప్పుడు పండు అనుకొని సూర్యుని మింగబోతే గాయమయింది. లంకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. లంకకు కావలిగా ఉన్న లంఖిణీని మొదట చంపుతాడు.

సుందరకాండ రాశారు. మిగిలిన కాండలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
చేస్తాను. నా మనసూ, దేవుడూ ఎప్పుడు చెబితే అప్పుడు చేస్తాను. దానికి ప్రశాంత వాతావరణం కావాలి. ఒక విషయం చెబుతాను. మహాభారతం రాయడానికి ప్రేరణ నా శ్రీమతి ఆరోగ్య పరిస్థితి. ఆమెకు క్యాన్సర్‌. ‌భాషను బతికించాలి, భార్యనూ బతికించుకోవాలి. ఇదే ఉద్దేశం. అప్పుడే ఎండకాలం సెలవులు రావడంతో రాయడం ప్రారంభించాను. అది అలా మొదలయింది.

మహాభారతం రాయడానికి ఎంత కాలం పట్టింది?
నాలుగు నెలలు. మొబైల్‌లోనే మొత్తం టైప్‌ ‌చేశాను. కానీ సుందరకాండకు 45 రోజులు పట్టింది.

మీ రచనా వ్యాసంగం ఎలా సాగుతుంది?
బడి నుంచి ఇంటికి వెళ్లగానే కాళ్లు చేతులు కడుక్కుని కంప్యూటర్‌ ‌ముందు కూర్చుంటాను. మళ్లీ ఉదయాన ఐదుగంటల కంటే ముందే స్నానం చేసి కూర్చుంటాను, ఏడూ ఏడున్నర వరకు.. ఒకసారి కూర్చుంటే కనీసం ఒక పాట పూర్తి కావాలి. నాకు పియానో వాయించే అలవాటు ఉంది. ఎమ్‌ఎస్‌ ‌రామారావు గారి పాటలు విన్నాను. మా అమ్మాయి గంగోత్రి ఆ పాటలు పెట్టింది. వాటిని అనువాదం చేసే ప్రయత్నం చేశాను కూడా.

ఇప్పుడూ మీరు అడవి ఒడిలో ఉన్నట్టే! ఈ పేర్లు ఇప్పుడు కూడా వినిపిస్తాయా? అవే- చైత్రరథవనం, నందనవనం, సాలవనం, గురుజాంగవనం, భారుండ -వారూత వనాలు, నైమిశారణ్యం, సారవనం, తటాక వనం, చిత్రకూటవనం, అలక్షితవనం, దండకారణ్యం.
వినిపిస్తాయి. దండకారణ్యం మా దగ్గరనే. ఛత్తీస్‌గఢ్‌, ఆం‌ధ్ర తెలంగాణ సరిహద్దు. నైమిశారణ్యం పేరూ వినిపిస్తుంది. చిత్రకూట అంటే మధ్యప్రదేశ్‌ ‌ప్రాంతంలో ఉంది. నైమిశారణ్యం సరే…నేను ఇక్కడ పాటల్లో విన్నాను. చిత్రకూట పర్వతం అంటే కాకి వచ్చి సీతమ్మ మీద దాడి చేసిన ఉదంతం గుర్తుకు వస్తుంది. అదే-కాకికి ఒంటి కంటి చూపు గురించి కథ!

మీరు రాసినది సుందరకాండ. ఆ కాండ గురించి మీ అనుభూతి!
అద్భుతం. మహాభారతం రాయాలంటే ముందు గీత చదవాలంటాం. రామాయణం చదవాలంటే సుందరకాండతో ఆరంభించాలి. అలా అయితేనే సంపూర్ణమవుతుంది. రామాయణంలో హను మంతుడు ముఖ్యం. కాబట్టి రామాయణం మళ్లీ రాయాలన్నా అంతే, ముందు సుందరకాండ చదవాలి.

రామాయణం త్వరలో రాస్తారు. కాబట్టి సుందరకాండ అందించారా?
హనుమంతుని అనుగ్రహం ఉంటేనే రామా యణం పూర్తి చేయగలుగుతాం. ఒక అడుగు వేయగలుగుతాం.

మన జాతి కావ్యాలు-రామాయణం, భారతం. సాహిత్యపరంగా చూసినా శిఖరాయమానంగా ఉంటాయి. నైతిక విలువల, కుటుంబ జీవనం ఇవన్నీ ఉంటాయి. వీటిని తెలుసుకోవాల్సిన అవసరం యువతరానికి ఉంది. కానీ వాటిలో కొన్ని పాత్రల పేర్లు కూడా యువతరం సరిగ్గా చెప్పలేకపోతున్నది. వాళ్లకి మీరు ఏం చెబుతారు?
అది ఉమ్మడి జీవితం, ఉమ్మడి కుటుంబాల జీవితం. కుటుంబం కలసి ఉండాలి. విలువల గురించి మహాభారతం నేర్పిస్తుంది. కలిసి ఉండడం కలిసి బతకడం. అన్నదమ్ములు ఆస్తుల విషయంలో ఎట్లా వ్యవహరించాలి? అదే కథ. స్త్రీల పట్ల మనం ఎట్లా ఉండరాదు, ఇది మరచిపోతే ఎలా నాశనం అవుతామో ఈ కథనే మనకు ఉదాహరణ. భారతీయులు, అంటే మనం, ఎట్లా బతకాలో ఈ ఇతిహాసాలే తెలియజేస్తాయి. మనం విదేశాలకు వెళ్లినా గౌరవిస్తారంటే, కారణం మన కల్చర్‌. ‌మన సంస్కృతికి పునాదులు ఈ కథలలో ఉన్నాయి. ఒకరు ఒకరి అభిప్రాయాలను గౌరవించాలి. నేను గొప్ప, కాదు నేనే గొప్ప అంటే అంతా నాశనం కాక తప్పదు. దుర్యోధనుడిలా నేనే గొప్ప, అంతా నాదే, నాకే కావాలి, ఎవరికీ ఇవ్వను, ఎవరి మాట వినను అంటే సర్వనాశనం అవుతావు. పెద్దవాళ్లు చెప్పేది వినాలి. వాళ్లు అనుభవపూర్వకంగా చెప్తారు. కాబట్టి సత్యం ఉంటుంది, వాస్తవం ఉంటుంది. ఇప్పుడు రోజూ పేపర్లోనే చూస్తున్నాం. ఆస్తి కోసం అన్నని చంపడం, తమ్ముడిని చంపడం; పొలాల దగ్గర తగాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు అప్పటి నుంచి నడుస్తున్నాయి. కానీ దాని ఫలితం ఈ పురాణాలు చెబుతున్నాయి. 20, 30 సంవత్స రాల క్రితం అన్నీ ఉమ్మడి కుటుంబాలే. గోండులలో ఇప్పుడు కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఇంటివాళ్లందరూ కలిసి చేస్తారు. అంటే వారసత్వం కొనసాగుతున్నది. కొనసాగించాలి.

మన వనవాసి భాషలకు సంబంధించి చాలా చోట్ల నిషాదులు, భిల్లులు, ముండా తెగ, సంథాల్‌ ‌తెగ, గోండులు, ఖాసీలు, మిజోలు వీళ్లతో పాటు, కేరళలో వేనాడ్‌లో నివసించేవారికి మన పురాణాలే ఇతివృత్తాలుగా ఎవరి కళారూపాలు వారికి ఉన్నాయి. వాటి మీద ఆయా ప్రాంతాల వనజీవనం ప్రతి బింబిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్లు కూడా వాటిని మీలా లిపిబద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది? దానికి అవకాశం ఉందా?
వారు లిపిబద్ధం చేయలేదు. కానీ కళారూపాలను కాపాడుకోవాల్సిందే. కొన్ని కళలు ఉన్నాయి, చాలా పవిత్రమైనవి. వాటిని పరిరక్షించాలి. ఇప్పటికీ మా దగ్గర కీకిరి కళ ఉంది. తరతరలుగా మా సమాజం వాయిస్తున్న సంగీత వాద్యం. కానీ అది అంతరించి పోయే దశకు వచ్చింది. కొందరు మధ్య వయస్కుల వారు ఆ వాద్యంతో ప్రదర్శనలు ఇస్తారు. తోషం అలాంటి గ్రామం. కానీ అంత విరివిగా గ్రామాల్లో ఇప్పుడు వాయించడం లేదు. కర్మకాండ చేసేటప్పుడు, పెరసాప కార్యక్రమాలు చేసేటప్పుడు అది కచ్చితంగా కావాలి.

మా పాఠకులకి ఏదైనా ఒక మాట చెప్పండి!
ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు కదా! ఉద్యోగం వచ్చే వరకు మనకు ఇంకొక రంగం ఉందని యువకులు గుర్తుంచుకోవాలి. మన చుట్టూ అనేక సమస్యలు ఉంటాయి, గతానివి ఎన్నో సాహస గాథలు ఉంటాయి. వాటిని అక్షరబద్ధం చేస్తే మంచిది. అలా గోండి భాషను బతికించిన వాళ్లవు తారు. ఇవాళ సాహిత్యం, కళారంగం వైపు ఎవరు చూడటం లేదు. ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా మనం కెరీర్‌ని కొనసాగిస్తూనే, ఆర్ట్‌ని రక్షించుకోవచ్చు. రచనలు చేస్తే మన భాష బతికి ఉంటుంది. సాహిత్యం మెరుగుపడుతుంది.

మీరు ఉపాధ్యాయులు. మీ వలెనే ఇంకా కొందరు పనిచేస్తున్నారు. వారసత్వానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించి, ఒక దృక్పథం కలిగినవారు మీరు. కాబట్టి చరిత్ర వైపు చూడమని ఒక చిన్న విన్నపం మేము చేసుకుంటున్నాం. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌స్థాపించడానికి దాదాపు 50 ఏళ్ల ముందే భారతదేశంలో బ్రిటిష్‌ ‌వాళ్లకు వ్యతిరేకంగా గిరిజన పోరాటాలు జరిగాయి. అవి చరిత్ర పుస్తకాలకి చేరలేదు. బీర్సా ముండా, అల్లూరి ఇలాంటి కొందరు మాత్రమే చరిత్రకు ఎక్కారు. మీలాంటి వారు తలుసుకుంటే అక్కడ ఇప్పటికీ అజ్ఞాతంగా ఉండిపోయిన స్వాతంత్య్ర సమర యోధుల గురించి మైదాన ప్రాంతాలకి అందించే కృషి ప్రారంభిస్తే చరిత్రకు మరింత సార్ధకత వస్తుందని నేను అనుకుంటున్నాను.
అనేకం ఉంటాయి మా దగ్గర కథలు. మా నాన్న చెప్తుండే. వాళ్లు అప్పుడు స్వాతంత్య్ర పోరాటాన్ని జై హింద్‌ అనేవారట. ఆ పోరాటంలో తాను పాల్గొన్నా నని చెప్తుండే. ఆదిలాబాద్‌కు గాంధీజీ వచ్చారు. ఒక మీటింగ్‌ ‌జరిగింది అని గుర్తు చేసుకునేవాడు మా నాన్న. ఆ రోజుల్లో, 40 సంవత్సరాలు 50 సంవత్స రాల క్రితం అడవులు బాగా ఉన్నాయి. అప్పుడు అడవులు నరికితే జైలుకు తీసుకుపోయేవారట. ఎందరినో పట్టుకుపోయేవారట. మా నాన్న కూడా జైలుకి వెళ్లాడు. కానీ వారి ఊసే లేదిప్పుడు. కొన్ని చోట్ల జైలుకి వెళ్లొచ్చిన పోరాట యోధులకి భూములు ఇచ్చారు. కానీ మా వాళ్లకు భూములు రాలేదు. ఇప్పటికి కూడా మా గ్రామంలో మా ఆదివాసులకు భూములు లేవు. నాన్‌ ‌ట్రైబల్స్‌కు ఉన్నాయి. అవే కాదు, ఇప్పుడు కూడా సాహసగాథలు ఉన్నాయి. మా వారు అడవికి ఏదో ఒక పని మీద వెళ్లవలసిందే. ఎలుగుబంట్లు దాడి చేస్తాయి, పులులూ దాడిచేస్తాయి. ఎదుర్కొంటారు. ఎంతో కష్టంతోనే బతుకుతారు. అవన్నీ సాహసగాథలే కదా! అలాగే చరిత్రనూ రాయాలి. ఆదివాసి జీవిమంటేనే పోరాటం. పోరాడితేనే పైకి వస్తాం. నేనే ఉదాహరణ. చిన్నప్పటి నుండి నేను అనేక పనులు చేసి కష్టపడి, ఈ స్థాయికి వచ్చాను. మా నాన్న వడ్రంగి. ఉద్యోగం రాకముందు నేను వడ్రంగిగా 10 రూపాయల కూలీకి వెళ్లాను. యాభయ్‌ ‌రూపాయల కూలితో పొలంలో పురుగు మందు కొట్టడానికి వెళ్లాను. ఆ డబ్బులతోనే పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నాను. అలా ఆదివాసి బతుకులే పోరాటాలు. ఇప్పటికి కూడా మా యువతరం పోరాడుతూనే ఉంది. ఉద్యోగ అవకా శాలు రావట్లేదు. ఎస్టీ కేటగిరీలోనే పోటీ ఉంది.

ధన్యవాదాలండి. చాలా విషయాలు చెప్పారు మీరు ఇలాంటి కథలు ఒక జాతీయ ఆత్మను స్పృషించే కథలు మీ భాషలో రచించడం అనేది ఎప్పటికీ అభినందనీయం. మీరు మోదీ ప్రశంసలకు నిజంగా అర్హులు. ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు జాగృతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, నమస్కారం.