
తిరుమల శ్రీవారి ఆలయంలోని పురాతన రాతి కట్టడాలకు పూర్వవైభవం రానుంది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన రంగనాయక మండపం, కల్యాణోత్సవ మండపాల్లోని రాతి స్తంభాలు సరికొత్త మెరుపును సంతరించుకోనున్నాయి. ధూపం, లడ్డూ పోటులోని వేడి వల్ల దెబ్బతిన్న శిలలను సంరక్షించేందుకు తితిదే నడుం బిగించింది. పుణెకు చెందిన ‘లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్’ (ఎల్‌వీసీఆర్‌టీ) ఈ పునరుద్ధరణ పనులను విరాళం రూపంలో చేపట్టేందుకు 2025 ఆగస్టు 18న ముందుకొచ్చింది. ఆ ట్రస్టుకు చెందిన సాంకేతిక బృందం శ్రీవారి ప్రధాన పోటు, అదనపు పోటు, వడ పోటు, వకుళమాత పోటు ఇతర మండపాలను పరిశీలించింది. లడ్డూ పోటులో విపరీతమైన వేడి కారణంగా రాతి స్తంభాల పైపొరలు ఊడిపోతున్నట్లు గుర్తించింది. తూర్పు వైపున ఉన్న రెండు స్తంభాలు పూర్తిగా దెబ్బతినడంతో వాటిని తక్షణమే మార్చాలని నిర్ణయించారు. అలాగే వకుళమాత పోటులో కట్టెల పొయ్యిల నుంచి వెలువడే వేడికి శిలలు కోతకు గురవుతున్నట్లు సాంకేతిక బృందం నివేదించింది. నెయ్యి, నూనె పదార్థాలు, మసి పేరుకుపోయి స్తంభాల సహజ సిద్ధమైన రంగు మారిపోయినట్లు గుర్తించారు.
సంప్రదాయ పద్ధతిలో మరమ్మతులు
ఎల్‌వీసీఆర్‌టీ ఈ పునరుద్ధరణ పనులను విరాళం రూపంలో చేపట్టనుంది. రంగనాయక మండపంలోని నాలుగు స్తంభాలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా (పైలెట్ బేసిస్) శుద్ధి చేయగా, వాటి రూపం అద్భుతంగా మారిందని తితిదే వర్గాలు తెలిపాయి. ఈ ఫలితాలతో సంతృప్తి చెందిన పాలకమండలి, తాజాగా జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపింది. పుణె సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది.





