News

ప్రధానికి ఉండే హక్కులే హిందూ శరణార్థులకు ఉంటాయి: అమిత్ షా

109views

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు కూడా భారతదేశంపై ప్రధానమంత్రి స్థాయి హక్కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన జన్-జన్ కీ సర్కార్: చార్ సాల్ బేమిసాల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌ (సీఏఏ) కింద పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన సుమారు 200 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్లు వెల్లడించారు. సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని ఆయన గుర్తుచేశారు. అయితే అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులకు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఉన్నంత హక్కు దేశంపై ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో జరిగిన బుజ్జగింపు రాజకీయాల కారణంగా వారికి హక్కులు దక్కలేదని ఆరోపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎంత నిరసన వ్యక్తం చేసినా అలాంటి శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. భారత న్యాయవ్యవస్థలో కూడా పెద్ద మార్పులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వలస పాలన కాలం నాటి పాత చట్టాలను తొలగించి భారతీయ న్యాయసంహిత వంటి కొత్త చట్టాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 2028 నాటికి ఈ చట్టాలన్నీ పూర్తిగా అమలులోకి వస్తాయని తెలిపారు.

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటుకు యువత చేసిన పోరాటాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు యువత ఉద్యమాలను అణచివేశాయని ఆరోపించారు. అయితే అప్పటి ప్రధాని అటల్‌బీహరి వాజ్‌పాయ్ నాయకత్వంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌‌సింగ్‌ ధామీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ నాలుగేళ్ల పూర్తి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.