News

ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు

90views

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. లోకకల్యాణం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఉదయం యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనములతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమైంది. అనంతరం నిర్ణీత మేష లగ్న పుష్కర ముహూర్తమైన ఉదయం 9:34 గంటలకు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి అమృతహస్తాలతో ప్రధాన ఆలయ శిఖర విమానగోపురానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనేక పుణ్యనదుల జలాలు, సముద్రోదకంతో నిర్వహించిన ఈ సంప్రోక్షణను తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అదే విధంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వారితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుంభాభిషేకానికి ఉన్న ప్రత్యేకమైన విశిష్టతను, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాక్రతువు వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తిని భక్తులకు కంచి పరమాచార్య శంకర్ జయేంద్ర సరస్వతి స్పష్టంగా వివరించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఆలయానికి పునర్జీవం పోసే ఈ మహా కుంభాభిషేక వేడుకలు ఇంద్రకీలాద్రిపై సర్వాంగ సుందరంగా జరిగాయి. మహా కుంభాభిషేకానికి హిందూ ధర్మంలో, ఆగమ శాస్త్రాల్లో ఎంతో విశిష్ఠత ఉంది. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన మూలవిరాట్ ఎంతో శక్తివంతమైనవి. అయితే నిత్యం జరిగే పూజలు, అభిషేకాలు, లక్షలాది మంది భక్తుల తాకిడి వల్ల కాలక్రమేణా ఆ విగ్రహాలు తమ దైవిక శక్తిని కొంతమేర కోల్పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

కుంభాభిషేక మహోత్సవాల ద్వారా ఆలయ తేజస్సు మరింత పెరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఈ క్రతువులో పాల్గొనే అవకాశం కల్పించారని అన్నారు. కొందరు అమ్మవారి పూజలు జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి మూలవిరాట్ ఫొటోలు, వీడియో తీసినట్లు ఆలయ సిబ్బంది గుర్తించారని, అలాంటి వారు వెంటనే వాటిని తొలగించాలని, లేనిపక్షంలో తాము ఆ దృశ్యాలు చిత్రాలు ఎక్కడ సర్క్యులేట్ అయిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

“రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. కుంభాభిషేక మహోత్సవాల ద్వారా ఆలయ తేజస్సు మరింత పెరిగింది. ఈ క్రతువులో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి పూజలు జరుగుతున్న సమయంలో కొందరు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఫొటోలను తీసినట్లు ఆలయ సిబ్బంది గుర్తించింది. అలాంటి వారు తక్షణమే ఫోన్లలో దృశ్యాలను తొలగించాలి. లేకపోతే వారిపై కఠిన చర్యలను తీసుకోవాల్సి వస్తుంది”-ఆనం రామనారాయణరెడ్డి,మంత్రి