News

దేశ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టొద్దు

107views

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేసిన ఫైజాన్ అనే వ్యక్తికి అలహాబాద్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు భారత్ దేశ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా లేదా సమాజానికి వ్యతిరేకంగా ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయవద్దన్నది కోర్టు షరతులలో ఒకటిగా వుంది. కోర్టు షరతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంటనే బెయిల్ ను రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.

గత యేడాది ఈ నిందితుడిపై పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని పలు కేసులతో పాటు దేశద్రోహ నేరం కూడా మోపారు. అయితే.. అతని పోస్ట్ అభ్యంతరకరమైనా.. దేశాన్ని అగౌరవపరిచే ఏ పోస్ట్ చేయలేదని, అందుకే BNS సెక్షన్ 152 వర్తించలేదని అతని న్యాయవాది వాదించారు.శత్రువు దేశానికి మద్దతు ఇవ్వడం మాత్రమే సెక్షన్ 152 BNS పరిధిలోకి రాదు” అని న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాకుండా గత యేడాది మే మాసం నుంచి నిందితుడు జైల్లో వున్నాడని, బెయిల్ మంజూరు చేయాలని, స్వేచ్ఛను దుర్వినియోగపరచడని అతని తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు.

అయితే నేర స్వభావం, సాక్ష్యాలు, కిక్కిరిసిన జైళ్లు, పెండింగ్ లో వున్న క్రిమినల్ కేసులను పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు.. నిందితునికి బెయిల్ మంజూరు చేసింది.