
( చైత్ర కృష్ణ పక్ష తదియ – ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి )
ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమా:
షడైతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయకా:
దీనర్థం ఏంటంటే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ ఆరు గుణాలు ఎవరికి ఉంటాయో అటువంటి వారికి దైవం కూడా సహకరిస్తుందని అర్థం. ఈ ఆరు సుగుణాల కలబోసి వీరుడిగా ఎదిగి ఛత్రపతిగా హిందూ హృదయ సామ్రాట్‌గా నిలిచాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. సొంత ప్రజల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలో బంగారుపుటల్లో నిక్షిప్తమయ్యాయి.
శౌర్యానికి ప్రతీకగా చెప్పుకునే ఛత్రపతి శివాజీ 1630వ సంవత్సరం చైత్ర కృష్ణ పక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గరగల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. శివాజీ తండ్రి అహ్మద్‌నగర్ సుల్తానేట్‌లో పని చేసేవారు. తల్లి జిజాబాయి భక్తి, ధర్మనిష్ఠ, వీరగాథల ద్వారా చిన్ననాటి నుంచే శివాజీ మనసులో దేశభక్తి, పరాక్రమం, స్త్రీగౌరవం వంటి విలువలు నాటారు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.
శివాజీ 17 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్లల్లో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది నచ్చని ఆదిల్ షా శివాజీ తండ్రిని బంధించాడు. ఆదిల్ షా నుంచి తన తండ్రిని శివాజీ విజయవంతంగా విడిపించుకున్నాడు. దీంతో మరింత రగిలిపోయిన ఆదిల్ షా..అఫ్ఝల్ ఖాన్‌ను ఉసిగొల్పాడు. ఇతడినే శివాజీ తన వాఘ్‌నఖ్‌తో హతమార్చాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆప్ఘన్ పస్థూన్ సైనికులను శివాజీ సేన మట్టుబెట్టింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.
మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో శిరసు వంచి, అనుకూల పరిస్థితుల్లో శిరసు నెత్తిన అపార రాజనీతి విశారదుడు ఛత్రపతి శివాజీ. ఇలా యుద్ధాలు చేస్తున్న శివాజీని 1674వ సంవత్సరమున విదేశీ దాడుల కారణంగా మరుగున పడిపోయిన పట్టాభిషేకం మంత్రాలను వెలికి తీసి శాస్త్రోక్తంగా, వేదపండితుల వేదపఠనాల మధ్యన, సప్త నదులు నాలుగు సముద్రాల నుండి సేకరించిన జలాలతో అభిషేకించి, ‘ఛత్రపతి’ బిరుదుతో హైందవ చక్రవర్తిగా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగింది. ఈ సామ్రాజ్యాన్ని ‘హిందూ పదపాదషాహీ’ గా హైందవి సామ్రాజ్యంగా ప్రకటించారు.
శివాజీ మహారాజ్‌లోని బహుముఖ ప్రజ్ఞ, సామాజిక దృక్పథం నేటికీ ఆదర్శంగా ఉంది. చరిత్రను కేవలం యుద్ధాల కోణంలో చూస్తే శివాజీ ఒక వీరుడు. సామాజిక న్యాయం కోణంలో చూస్తే ఆయన ఒక యుగపురుషుడు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, రైతుల శ్రేయస్సు కోసం ఆయన నిర్మించిన ‘స్వరాజ్యం’ నేటి ఆధునిక ప్రజాస్వామ్యానికి పునాది. శివాజీని ఒక ఆదర్శ పాలకుడిగా, అణగారిన వర్గాల విముక్తి ప్రదాతగా బాబాసాహెబ్ అంబేడ్కర్ గౌరవించారు. అంటరానితనానికి వ్యతిరేకంగా 1927లో జరిగిన చరిత్రాత్మక మహద్ సత్యాగ్రహ వేదికపై శివాజీ చిత్రపటాన్ని ఉంచడం ద్వారా, ఈ పోరాటం శివాజీ ఆశయాల కొనసాగింపు అని అంబేడ్కర్ చాటి చెప్పారు.
ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పర్షియన్ భాషకు బదులుగా మరాఠీ, సంస్కృతం వాడకాన్ని శివాజీ ప్రోత్సహించారు. శత్రువుల మహిళలను కూడా తల్లులుగా గౌరవించిన ఉన్నత సంస్కృతి శివాజీది. సామాజిక పురోగతిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని అర్థం చేసుకున్న శివాజీ అభ్యాసం, జ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించారు. ఆయన పరిపాలన నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండేది. మూర్తీభవించిన హిందూ ధర్మానికి, సంస్కృతికి శివాజీ మహారాజ్ ఒక గొప్ప ప్రతీక. శివాజీ మహారాజు పరిపాలనలో న్యాయం, ధర్మం, ప్రజాహితం ప్రధానంగా నిలిచాయి. మహిళల గౌరవ రక్షణ, మతసహనం, శత్రువుల పట్ల కూడ కరుణ వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా నిలబెట్టాయి. 1680 ఏప్రిల్ 3న ఆయన పరమపదించారు. అయితే ఆయన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలిచింది. స్వాతంత్ర్య సమరయోధులకు, దేశభక్తులకు ఆయన జీవితం ఆదర్శం. ధైర్యం, దేశభక్తి, స్వాభిమానం కలయికే శివాజీ మహారాజు. ఆయన చరిత్ర భారత సంస్కృతికి చిరస్మరణీయ గౌరవ చిహ్నం. శివాజీ మహారాజు — ఒక రాజు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని కాపాడిన సంకల్పశక్తి. ఛత్రపతి శివాజీ మహారాజు – ఒక జ్యోతి, ఒక జాగృతి





