News

మేడాపురంలో విజయనగర సామ్రాజ్య శాసనాలు

94views

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో క్రీ.శ. 14, 15 శతాబ్దాలకు చెందిన విజయనగర సామ్రాజ్య శాసనాలు రెండింటిని గుర్తించినట్లు చరిత్రకారుడు గోపి తెలిపారు. ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు. మొదటి శాసనాన్ని గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా, రెండో శాసనాన్ని చెరువు తూము వద్ద గుర్తించినట్లు తెలిపారు.

ఈ శాసనాల ప్రకారం మేడాపురం గ్రామాన్ని ఒకప్పడు మంగమారేపల్లిగా పిలిచేవారని నిర్ధారణ అయిందన్నారు. ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న శాసనాన్ని క్రీస్తు శకం 1551లో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడు అలియ రామరాయలు వేయించారని, ఈ శాసనంలో గ్రామంలో ఉన్న ప్రసన్న వరదరాజస్వామి ఆలయ నిర్మాణ విశేషాలు ఉన్నాయన్నారు. చెరువు తూము వద్ద ఉన్న రెండవ వీరగాళ్ల శాసనాన్ని 14వ శతాబ్దంలో మొదటి బుక్కరాయలు ప్రధాని చిక్క ఒడయార్‌ వేయించారన్నారు. ఈ శాసనం ప్రకారం ఈ చెరువును చిక్క ఒడయార్‌ తవ్వించినట్లుగా తెలుస్తోందన్నారు. ఆయన తల్లి మేడమ్మ అదే గ్రామంలో మరణించడంతో మృతదేహాన్ని చెరువు తూము వద్ద సమాధి చేశారని, ఆమె పేరు మీదనే గ్రామాన్ని మేడాపురంగా మార్చారని వివరించారు. ఇక్కడి ఆలయాలకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉందని, వీటిని సంరక్షించి అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో గోపీతో పాటు చరిత్ర అధ్యాపకుడు తొండూరు అహమ్మద్‌ పాల్గొన్నారు.