News

‘ప్రార్థనా స్థలాల చట్టం-1947’ వివాదంపై తుది విచారణకు తేదీని నిర్ణయిస్తాం

115views

‘ప్రార్థనా స్థలాల చట్టం-1947’లోని పలు నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తుది విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. విచారణ తేదీలను త్వరలో నిర్ణయిస్తామని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. ప్రస్తుతం రెండు వేర్వేరు వివాదాలపై 9మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనాలు ఏర్పాటయ్యాయని, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విచారణ జరపనున్నాయని పేర్కొన్నారు. ఆ వ్యాజ్యాల అనంతరం ‘ప్రార్థనా స్థలాల చట్టం’పై తుది విచారణను చేపడతామన్నారు. అంతకుముందు …పిటిషనర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ మాట్లాడుతూ…ప్రార్థనా స్థలాల చట్టం నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అంశాలను సుప్రీం ధర్మాసనం 2022 అక్టోబరు 12న ఖరారు చేసిందని బుధవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబరు 31వ తేదీకల్లా స్పందనను దాఖలు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ చేయలేదని తెలిపారు.