News

‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’ సినిమా టైటిల్‌పై సుప్రీం వ్యాఖ్య

106views

వివాదాస్పదంగా మారిన ‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’సినిమా టైటిల్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఓ కులాన్ని లేదా వర్గాన్ని కించపరచ లేరని స్పష్టం చేసింది. ఆ పేరును మార్చేదాకా సినిమాను విడుదల చేయవద్దంటూ ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖకు, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సరి్టఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి, సినిమా నిర్మాత నీరజ్‌ పాండేకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

ప్రముఖ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి నటించిన ‘ఘూస్‌ఖోర్‌ పండట్‌’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించారు. అయితే, సినిమా టైటిల్‌ తమ వర్గం ప్రజలను కించపరిచేలా ఉందంటూ బ్రాహ్మణ్‌ సమాజ్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ ఆర్గనైజేషన్‌ సెక్రటరీ అతుల్‌ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఆయన పిల్‌ వేశారు.

సినిమా పేరుతోపాటు కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆయన ఆరోపించారు. కులాన్ని, మతాన్ని సూచించే పండిత్‌ అనే పదాన్ని, అవినీతిని సూచించే ’ఘూస్‌ఖోర్‌(లంచగొండి)’తో కలిపి వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్‌పై గురువారం జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

‘జాగృతం చేయడం, ప్రజలను కించపరుస్తూ అశాంతిని సృష్టించడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఇప్పటికే ఉన్న విభేదాలు చాలవన్నట్లు, మీరు కొత్తగా ఇలాంటి వాటితో మరింతగా అలజడులను ఎందుకు సృష్టిస్తున్నారు’అంటూ నిర్మాతపై మండిపడింది. ‘రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌ స్వాతంత్యాన్ని మేం గౌరవిస్తున్నాం. అదే సమయంలో దానికీ హద్దులున్నాయి. మీరు ఎవరినైనా ఎందుకు కించపర్చాలి? ఇటువంటి పేరుపెట్టి ఓ వర్గం వారిని ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు?’అని ప్రశ్నించింది. ‘దీనిని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించలేం. ఆ హక్కు ఇతరులను కించపరిచేందుకు ఇచి్చన లైసెన్సు కాదు.

ఇలాంటివి నైతికతకు, సమాజానికి వ్యతిరేకం. పేరు మార్చకుండా సినిమాను విడుదల చేయడానికి మేం అనుమతించం. సినీ నిర్మాతలు, జర్నలిస్టులు తదితరులు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నాం’అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా, చిత్రనిర్మాత తరపు న్యాయవాది.. కొత్త టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా టైటిల్‌ను ఎంపిక చేస్తామని హామీ ఇచ్చారు. సినిమా టైటిల్‌ వివాదంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా..ఆ పేరును మారుస్తామంటూ నెట్‌ఫ్లిక్స్‌ హామీ ఇచ్చింది. కథాంశాన్ని, ఉద్దేశాన్ని ప్రతిబించేలా మరో పేరు పెడతామంది.