News

శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నూతన ఆలయాలు

134views

గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మికత.. భక్తిభావం పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి ) నిత్యం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవాణి భజన మండపం పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నూతన ఆలయాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో స్థలం కేటాయిస్తే ఆలయానికి అవసరమైన నిధులను తితిదే మంజూరు చేస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల కాలనీల్లో నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తారు. స్థల విస్తీర్ణానికి అనుగుణంగా శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.10-20 లక్షల వరకు నిధులు విడుదలవుతాయి.

24 ప్రాంతాల్లో నిర్మించేలా..
కర్నూలు జిల్లాలో 10 ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో పత్తికొండ మండలం హోసూరు, ఆస్పరి మండలం కారుమంచి, ములుగుందం, గోనెగండ్ల మండలం ఎర్రబాడు, కోసిగి మండలం అగసనూరు, సాతనూరు, పెద్దకడబూరు మండలం కంబాలదిన్నె, పీకలబెట్ట, కౌతాళం మండలం ఉంగలదిన్నె, మంత్రాలయం మండలం రాంపురం గ్రామాలున్నాయి. నంద్యాల జిల్లాలో 14 ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలకుగాను ప్రతిపాదించారు.

ఒకే నమూనాలో..

  • గ్రామంలో ఆలయ నిర్మాణానికి స్థలం ఉన్నట్లు రెవెన్యూ అధికారి ధ్రువీకరించిన పత్రం ఉండాలి. నూతన ఆలయానికి ఏర్పాటుచేసుకున్న కమిటీ తీర్మానం అవసరం ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతా తెరవాలి.
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నింటినీ ఒకే నమూనాలో నిర్మించనున్నారు. కేటాయించిన స్థలంలో గర్భాలయం, విమాన గోపురం, మండప నిర్మాణం చేపడతారు.
  • గర్భగుడిలో మూలవిరాట్టు ఏర్పాటు, ప్రహరీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన నిధులు మరో విడతలో కేటాయించనున్నారు. మంజూరు చేసిన నిధులు తక్కువైతే అదనంగా విడుదల చేసే అవకాశముంటుంది.
  • స్థలాలిచ్చేందుకు ముందుకు రావాలి
    శ్రీవాణి భజన మండపం పథకం కింద ఆలయాన్ని నిర్మించే స్థలాన్ని ఇరువురు ఏఈలతోపాటు దేవాదాయశాఖ ఉద్యోగి పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉన్నాయని ధ్రువీకరించిన తర్వాత ప్రభుత్వానికి పంపుతాం. కర్నూలు జిల్లాలో 21 గ్రామాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.. అందులో 10 గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాం. గ్రామీణ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణాలకు స్థలం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి.– సుధాకర్‌రెడ్డి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌