News

చివరి దశకు నక్సలిజం

133views

నక్సలిజం చివరి దశకు వచ్చినట్టు.. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు నేడు కేవలం మూడే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 364 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటర్ అయ్యారని, మరో 1022 మంది అరెస్టయ్యారని కేంద్రం వివరించింది. గత ఐదేళ్లలో 7,409 మంది నక్సలైట్లు అరెస్టవ్వగా, 5,880 మంది లొంగిపోయినట్టు తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నక్సలిజం అంతానికి ప్రకటించిన డెడ్‌లైన్(ఈ ఏడాది మార్చి 31) మరో రెండు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలు వెల్లడించింది. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఓ ప్రత్యేక విధానాన్ని స్వీకరించింది. కేంద్రం, ప్రభావిత రాష్ట్రాలు ఉమ్మడిగా అమలు చేసిన ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టింది.

పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశమైనా మావోయిజం అంతానికి రాష్ట్రాలతో కలిసి పని చేసిందని కేంద్ర హోం శాఖ లోక్‌సభలో తాజాగా వెల్లడించింది. బలగాల శిక్షణ, నిర్వహణా ఖర్చులు, పునరావాసానికి, పరిహారాలకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 3,681.73 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. హైక్యాడర్ నక్సలైట్‌కు లొంగిపోయిన తక్షణమే రూ. 5 లక్షలు, లో క్యాడర్‌కు రూ. 2.5 లక్షలు అందించాలని ఈ పాలసీలో నిర్ణయించుకున్నారు. ఆయుధాలు అప్పగించివారికి ఇన్సెంటివ్‌లు అందించాలనీ పొందుపరిచారు. లొంగిపోయిన మావోయిస్టులకు మూడేళ్లపాటు నెలకు రూ. 10 వేల స్టైపండ్‌నూ నిర్ణయించారు.

ఒకవైపు బలగాల పటిష్టం.. మరోవైపు ‘అభివృద్ధి పనులు’..
నక్సలైట్ల అంతానికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు బలగాలను పటిష్టం చేస్తూనే.. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లోకి రోడ్లు, మొబైల్ టవర్లు, పోస్టాఫీసులు, బ్యాంకింగ్ సేవలు సహా ఇతరత్రాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రాలకు ఆయుధాలు, ఐటీ ఎక్విప్‌మెంట్లు, కమ్యూనికేషన్, బలగాల ట్రైనింగ్, పోలీసు స్టేషన్‌ల నిర్మాణం, రవాణా ఇతరత్రాల కోసం ప్రత్యేకంగా మాడ్రనైజేషన్ ఆఫ్ పోలీసు ఫోర్స్‌ పథకాన్ని అమలు చేసింది. దీని ఉపపథకం కింద రాష్ట్రాల ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ బ్రాంచీలు, జిల్లా పోలీసులు, పటిష్ట పోలీసు స్టేషన్‌ల నిర్మాణానికి రూ. 1761 కోట్లు మంజూరు చేసింది. క్యాంప్‌లు, హెలికాప్టర్ సేవలు, ఇతరత్రాలకు రూ. 1224.59 కోట్లు అందించింది. అదే విధంగా మావోయిస్టుల ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, మావోయిస్టులకు, వారికి ఆర్థిక సాయం చేసే వారికి మధ్య బంధాల గుట్టును కనిపెట్టడానికి, నక్సలైట్ల ఇతర వనరులనూ నష్టపరచడానికి కేంద్ర ఏజెన్సీల సహకారంతో రాష్ట్ర పోలీసులు సమన్వయంలో అనేక చర్యలు తీసుకున్నారు.

15 వేల కి.మీల రోడ్డు నిర్మాణం..
పలు పథకాల కింద నక్సల్ ప్రభావిత జిల్లాల్లో మౌలికసదుపాయాలకూ కట్టుబడినట్టు కేంద్రం వివరించింది. ఇందులో భాగంగా 15,016 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది. 9,233 మొబైల్ టవర్లు అందుబాటులోకి వచ్చాయి. 46 ఐటీఐలు, 49 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఓపెన్ చేశారు. 179 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్నాయి. 6,025 పోస్టాఫీసులు, 1804 బ్యాంక్ బ్రాంచీలు, 1321 ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. 2017 నుంచి ఈ సదుపాయాల కోసం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ పథకం కింద రూ. 3,953.67 కోట్లు విడుదలయ్యాయి.

88 శాతం తగ్గిన హింసాత్మక ఘటనలు..
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లు, పథకాలతో మావోయిస్టుల ఉనికి తగ్గిపోతున్నది. 2018లో 126 నక్సల్ ప్రభావిత జిల్లాలుండగా 2025 డిసెంబర్‌నాటికి మూడుకు తగ్గిపోయాయి. 2010లో 1936 హింసాత్మక ఘటనలు జరగ్గా 2025 88 శాతం తగ్గి 234కు తగ్గాయి. పౌరులు, పోలీసుల మరణాలు 2010లో 1005గా ఉండగా.. 2025లో 90 శాతం తగ్గి 100కు చేరాయి. 2025లో 364 మంది నక్సలైట్లు ఎన్‌కౌంటరవ్వగా 1022 మంది అరెస్టయ్యారు. 2337 మంది సరెండరయ్యారు. 2019 నుంచి 2026 జనవరి 15వ తేదీకల్లా 7409 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. 5880 మంది లొంగిపోయారు. మావోయిస్టులను ఈ ఏడాది మార్చి 31కల్లా (మరో రెండు నెలల్లో) పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డెడ్‌లైన్ ప్రకటించిన నేపథ్యంలో తాజా వివరాలు కీలకంగా ఉన్నాయి. ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకే పరిమితమైన నక్సలైట్ ఉద్యమాన్ని మరో రెండు నెలల్లో పూర్తిగా తుడిచివేస్తామని కేంద్రం చెబుతున్నది.