ArticlesNews

వేదాలకు ప్రతీకలు

283views

సాధారణంగా మనుషులందరికీ అవయవాలు సమానసంఖ్యలో ఉంటాయి. అయితే కొంతమంది దేవతలకు, ఆ మాటకొస్తే కొందరు రాక్షసులకు కూడా అవయవాలు ఎక్కువ ఉండటం విశేషం. బ్రహ్మ నుంచి రావణ బ్రహ్మ వరకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తారు.

త్రిమూర్తుల్లో బ్రహ్మకు నాలుగు తలలుంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీకలు. సృష్టిలోని నాలుగు దిక్కులలోని ప్రాణుల పుట్టుకను చూడటానికి ఈ తలలు ఆవిర్భవించాయంటారు. బ్రహ్మ అభిజిత్‌ లగ్నమనీ, ఆ నక్షత్రానికి ఉన్న నాలుగు ముఖాలే బ్రహ్మ ముఖాలని మరో కథనం. అసలు బ్రహ్మకు అయిదు తలలుంటే ఆయన అహంకారాన్ని తొలగించడానికి శివుడు ఒక శిరస్సును ఖండించాడని కూడా చెబుతారు. అయితే ఆ అయిదో తలను శివుడు నరికేయడానికి బ్రహ్మ ప్రదర్శించిన అనుచిత స్త్రీ వ్యామోహం కారణమని మరో పౌరాణిక కథనమూ ఉంది.
విష్ణువుకు నాలుగు చేతులైతే వాటిలో శంఖం, చక్రం, గద, పద్మం ఆయుధాలుగా ధరిస్తాడని తరతరాలుగా భక్తుల విశ్వాసం. పరమ శివుడికి మూడు కళ్లు. రెండు కళ్లు సూర్యచంద్రులనీ, మూడో కన్ను అగ్ని అనీ అంటారు. పార్వతీదేవి తన చేతులతో శివుడి రెండు కళ్లనూ మూసివేస్తే ప్రపంచమంతా అంధకారం అలుముకోవడం వల్ల పరమేశ్వరుడికి అగ్నితో కూడిన కన్ను ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.

అవయవాల సంఖ్య కారణంగానే దేవుళ్లకు కొన్ని పేర్లు కూడా స్థిరపడ్డాయి. నాలుగు ముఖాల బ్రహ్మను చతుర్ముఖుడు, చతురాననుడు, చతుర్వదనుడు, నలువ అనీ; నాలుగు చేతుల విష్ణువును చతుర్భుజుడనీ, మూడు కళ్ల శివుణ్ని ముక్కంటి, త్రినేత్రుడు, ఫాలాక్షుడు అనీ అంటారు.

అలాగే ఆరుగురు కృత్తికల దగ్గర పాలు తాగి సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడయ్యాడు. అర్ముగమనీ అనిపించుకున్నాడు. స్వర్గాధిపతి ఇంద్రుడు కామాంధుడై చేసిన తప్పిదం వల్ల గౌతమీ మహర్షి శాపంతో ఆపాదమస్తకం మర్మస్థానీయుడయ్యాడు. పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకున్నాక గౌతమ మహర్షి కరుణతో ఇంద్రుడు సహస్రాక్షుడిగా మిగులుతాడు. శాపవశాత్తు చేతులు లేకుండా పుట్టిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ మహర్షి వరంతో వెయ్యి చేతులు సంపాదించుకుని అన్ని చేతులతోనూ బాణాలు వేయగలిగిన శక్తిసామర్థ్యాలు సంపాదించుకుంటాడు.

విరాట్‌ పురుషుడి గురించి ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్‌’ అనే శ్లోకం ఉంది. దీని ప్రకారం విరాట్‌ పురుషుడికి వెయ్యి తలలు, వెయ్యి కళ్లు, వెయ్యి కాళ్లు ఉంటాయి. అయితే సహస్ర అంటే వెయ్యి మాత్రమే కాదని, అనంత అనీ అర్థం చేసుకోవాలని పండితులు చెబుతారు.

ఇక రాక్షసుడైన రావణుడికి బ్రహ్మ వరంతో పది తలలు వచ్చాయన్నది పురాణగాథ. ఆ పది తలలు నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాలని ఒక పురాణ కథనమయితే, పది దుర్గుణాలకు ప్రతీకలని మరో కథ. పురాణం అంటే ‘పురా అపి నవం’ అని వ్యుత్పత్తి. పాత విషయాలకు కొత్త కొత్త అన్వయాలు, భాష్యాలు వాటిలో కనిపిస్తుంటాయి. అవయవ సంఖ్యాధిక్య విశేషాలూ అందులో భాగమే.