News

ఆదివాసీ యువ సమ్మేళనం

213views

పార్వతీపురం మన్యం జిల్లా  గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుక్కిడి జంక్షన్‌ వద్ద ఆర్ట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న ప్రారంభించిన ‘ఆదివాసీ సంస్కృతి–సంప్రదాయ యువ సమ్మేళనం’ సోమవారం ముగిసింది. ఈ మేరకు చివరి రోజు కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు అరకు ప్రాంతం నుంచి విచ్చేసిన ఆదివాసీలు అదే ఉత్సాహంతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ అలరించారు.అలాగే సభ వద్ద జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్కృతి, సంప్రదాయాలు విడిచిపెట్ట రాదు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ యువ సమ్మేళనం ముగింపు సందర్భంగా నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బాబూరావునాయుడు మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా మార్పు తప్పనిసరి అయినప్పటికీ..పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, ఆదివాసీ సంస్కృతిని విడిచిపెట్ట రాదన్నారు. భావితరాలకు వాటిని అందివ్వాలంటే కొనసాగించడంపై నేటి ఆదివాసీ యువత శ్రధ్ధ వహించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. కేవలం ఫండ్స్‌ కోసమే పనిచేసే సంస్థలెన్నో ఉన్నాయని, అందుకు భిన్నంగా పనిచేస్తున్న ఆర్ట్స్‌ సంస్థ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవకుండా భావితరాలకు వాటిని అందించేందుకు యువతలో ఉత్తేజాన్ని నింపేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.