News

ఆదివాసీ సంస్కృతి – సాంప్రదాయ యువ సమ్మేళనం

179views

ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు మన దేశానికే గర్వకారణమని, గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి గ్రామంలో ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ సంస్కృతి-సాంప్రదాయ యువ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీ సంస్కృతి, వారసత్వం ఎంతో గొప్పదని, దాన్ని భావితరాలకు అందించాలని సూచించారు. ఆదివాసీ ఆచార వ్యవహారాలను ప్రపంచానికి చాటి చెప్పుదామని, విదేశీ పర్యాటకులు సైతం మన్యం జిల్లాకు రావాలనేది సీఎం ఆకాంక్ష అని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలని, ఎవరైనా వెళ్తే దండించాలని సూచించారు.

ప్రభుత్వ విప్, కురుపాం శాసన సభ్యురాలు తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. నాగరికతకు మారుపేరు ఆదివాసీలు అని, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు దేశానికే గర్వకారణమని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. త్వరలో ప్రతి గ్రామానికి అంబులెన్సు వెళ్తుందని, గిరిజనుల కష్టాలు తీరాబోతున్నట్లు చెప్పారు. అలాగే మన్యంలో హెల్పింగ్ హాండ్స్ అనే మరో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారని, దీని వలన నిరక్షరాస్యులైన అమాయక గిరిజనం ఆసుపత్రిలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి ఆరోగ్యవంతునిగా ఇంటికి వెళ్లే వరకు వాలంటీర్ బాధ్యత తీసుకుంటారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ హెల్పింగ్ హాండ్స్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.