
జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) నమోదులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఎటువంటిపత్రాలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్యను వారు స్వచ్ఛందంగా తెలిపితేనే నమోదు చేస్తామని ఇందుకోసం ఎవర్నీ బలవంతం చేయబోమని వెల్లడించింది. ఎన్‌పీఆర్ నమోదు గురించి రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని, వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. కుటుంబ, వ్యక్తిగత వివరాల తోపాటు వారు నివసిస్తున్న గ్రామ, పట్టణ, నగరానికి సంబంధించిన వివరాలను మాత్రమే నమోదు చేయనున్నట్లు పేర్కొంది.
”ఎన్‌పీఆర్ 2020 నమోదుకు సబంధించి గణకులు, సూపర్‌వైజర్లు అనుసరించవలసిన విధివిధానాలను ఇప్పటికే రూపొందించాం. ప్రజలు వారికి తెలిసిన పూర్తి సమాచారాన్ని గణకులకు తెలిపితే సరిపోతుంది. నమోదు సమయంలో వారి నుంచి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు సేకరించం. అంతేకాకుండా పౌరసత్వం సందేహాస్పదంగా ఉన్న వ్యక్తుల ధ్రువీకరణను కూడా తనిఖీ చేయం. ప్రజలు కేవలం వారి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తే సరిపోతుంది. ఆధార్ సంఖ్యను నమోదులో కూడా ఎటువంటి బలవంతం ఉండదని, స్వచ్ఛందంగా వెల్లడించిన వారి వివరాలను మాత్రమే నమోదు చేస్తారు” అని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్‌పీఆర్ నమోదు ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30,2020 వరకు నిర్వహించనున్నారు.
.పౌరసత్వ చట్టం 1955 ప్రకారం రూపొందించబడిన పౌరసత్వ నిబంధనలు 2003 రూల్ 3లోని సబ్ రూల్ 4 (రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటీ కార్డ్)ను అనుసరించి కేంద్రం ఒక్క అసోం రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా జనగణనను చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రక్రియను పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.





