
165views
హిందువులకు అత్యంత పవిత్రమైన అయ్యప్ప సన్నిధానం శబరిమలలో కలకలం రేగింది. అయ్యప్ప స్వాములు విశ్రాంతి తీసుకొనే, అత్యంత రద్దీగా వుండే నడకండల్ అనే ప్రాంతంలో ఇస్లామిక్ జెండాను వుంచారు. ఆ ప్రాంతంలోని షెడ్డును ఆనుకొని వున్న ఓ స్తంభానికి ఈ జెండాను వుంచడం ఇప్పుడు కలకలం రేగింది. ప్రస్తుతం శబరిమలైకి అయ్యప్ప స్వాములు అత్యంత నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో వచ్చే సమయం. అత్యంత రద్దీగా కూడా వుంటుంది. ఇంతటి రద్దీలో కూడా ఎవరు ఈ ఇస్లాం జెండాను పెట్టి వుంటారన్న చర్చ ప్రారంభమైంది.
మరో వైపు అయ్యప్ప స్వామి భక్తులు కూడా దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ ఇన్ని సీసీ టీవీలు, ఇంత మంది అయ్యప్పలు సంచరిస్తున్న సమయంలో ఎవరు ఈ పని చేశారని మండిపడుతున్నారు.
ఈ విషయాన్ని స్థానిక మీడియా కూడా చూపించింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ కూడా అవుతోంది. ప్రస్తుతం నడిచేది ‘‘మకర విళక్కు’’ తీర్థాయాత్ర కాలం. నడకండల్ అనే ప్రాంతంలో భద్రత కూడా అంతే కట్టుదిట్టంగా వుంటుంది. అయ్యప్ప స్వాములు నడిచి వెళ్లే మార్గం మొత్తం కూడా కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలో వుంటుంది. నిరంతర వారి పర్యవేక్షణ కూడా వుంటుంది. ఇంతటి వాతావరణంలో కూడా ఇస్లామిక్ జెండా కనిపించడం తీవ్ర ఆందోళనను కలిగించడమే కాకుండా, చర్చకు కూడా దారి తీసింది.
మరో వైపు కొన్ని రోజులుగా అత్యంత పవిత్రమైన శబరిమల దేవస్థానం విషయంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. భక్తుల మనోభావాల విషయంలో గానీ, అయ్యప్పకి సంబంధించిన ఆభరణాల విషయంలో గానీ సరిగ్గా వ్యవహరించడం లేదు. ప్రభుత్వం అనేది అందర్నీ సమానంగా చూసే వ్యవస్ధ. కానీ అక్కడ మాత్రం హిందువుల మనోభావాలను గానీ, దేవాలయ వ్యవస్థను గానీ ఏమాత్రం పట్టించుకోరు.
రాష్ట్రంలోని చాలా దేవస్వం బోర్డులు సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వ నియంత్రణలోనే వున్నాయి.అయితే.. గతంలో ఓ దేవాలయంలో కాషాయ జెండాలను అలంకరిస్తే మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. వాటిపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా లౌకిక నిబంధనలు అంటూ అప్పటికప్పుడు కొన్ని నిబంధనలను తెచ్చి, కాషాయ జెండాలను తొలగించిన సందర్భాలూ వున్నాయి. మరి ఇప్పుడు ఈ ఇస్లామిక్ జెండా ఎలా ప్రత్యక్షమైంది? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇది హిందువులపై వివక్ష చూపించడమే అవుతుందని స్పష్టంగా తేలిపోతోందని కూడా అంటున్నారు.





