ArticlesNews

1840 నుంచి సవాళ్లు, వలస పాలకుల ప్రయత్నాలు, అయినా మాఘ మేళా నిరంతరంగా ఎలా కొనసాగింది?

154views

ఉపశీర్షిక : అమెరికన్ మిషనరీల ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆధునిక నిధుల వరకు, వందల సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా ప్రయాగ్రాజ్ మాఘ మేళా ఎలా అఖండంగా నిలిచింది? అసలు వలస పాలన గానీ, మత మార్పిడి ప్రచారాలు గానీ ఆపలేని ఆ శక్తి ఏమిటి?

ప్రతి సంవత్సరం పొగమంచు తొలగగానే, కోట్లాది మంది ప్రజలు భక్తితో ప్రయాగ్ రాజ్ సంగమం దగ్గర ఇసుకపై నడుస్తారు. మాఘ మేళా అనాది కాలం నుంచి ఇలాగే ఉందేమో అనిపిస్తుంది. సాధు సంతులను, సాధకులను.. సనాతన ధర్మాన్ని కలిపే ఒక అఖండమైన గొలుసులా అది నిలిచి ఉంది. వేల సంవత్సరాలుగా ఋషులు, మునులు సమావేశమయ్యే ఈ పవిత్ర స్థలం, గత 200 సంవత్సరాలుగా ఒక నిశ్శబ్దమైన పోరాటాన్ని, సంఘర్షణను కూడా చూస్తోందనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.

ఈ సంఘర్షణ 1840లో ప్రారంభమైంది. ఆ సమయంలో జోసెఫ్ ఓవెన్ అనే అమెరికన్ ప్రెస్‌బిటేరియన్ మిషన్ పాస్టర్ ప్రయాగ్రాజ్‌కు వచ్చారు. ఓవెన్ దృష్టిలో మాఘ మేళా అనేది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. ఒకేసారి వేలాది మందిని సులభంగా కలిసి, వారిని మతమార్పిడి చేయడానికి ఇది ఒక ‘అద్భుతమైన అవకాశం’ అని భావించాడు. కానీ.. తాను ప్రవేశిస్తున్న భారతీయ నాగరికత.. ఎంత ప్రాచీనమైనదో, ఎంత శక్తివంతమైనదో ఓవెన్ అర్థం చేసుకోలేకపోయారు.

ప్రయాగ్రాజ్ : మిషనరీల లక్ష్యంగా ఎలా మారింది
మిషనరీ కార్యకలాపాలు అంతకుముందు 1834లోనే మొదలయ్యాయి. రెవ.విలియం రీడ్ మరియు రెవ.జె.సి.లోరీ లుధియానాలో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, నాటి ప్రయాగ్రాజ్ (నాటి అలహాబాద్) వారి దృష్టిలో చాలా ప్రత్యేకమైన స్థలం. ఇక్కడ సంగమం వద్ద సంవత్సరం పొడవునా భక్తులు స్నానానికి వస్తారు. ప్రతి సంవత్సరం మాఘ మేళా ఇంకా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది.

1841 నాటికి పాస్టర్ జోసెఫ్ ఓవెన్.. ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. తన ప్రచారం స్థానికంగా ప్రభావం చూపడం కోసం ఆయన హిందీ, సంస్కృతం మరియు పర్షియన్ వంటి స్థానిక భాషలు నేర్చుకున్నారు. అంతే.. నెమ్మదిగా మేళా జరిగే ఇసుకపై క్రైస్తవ సాహిత్యం, పత్రాలు, చిన్న పుస్తకాలు, అనువదించబడిన బైబిళ్లు.. పంపిణీ చేశారు.

1847 జనవరి 1న ప్రయాగ్రాజ్‌లో ఒక చర్చ్ మిషనరీ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించింది. దీనిని మొదట రెవ.జోసెఫ్ వారెన్, ఆ తరువాత రెవ.లారెన్స్ జి.హే.. నిర్వహించారు. దీనికి నార్త్ ఇండియా బైబిల్ సొసైటీ (1845, ఆగ్రా) నిధులు సమకూర్చేది. ఈ ప్రెస్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయబడింది. అయితే ఎన్ని ప్రయత్నాలు జరిగినా.. సాధువుల ధుణిలు (మంటలు) వెలుగుతూనే ఉన్నాయి. అఖాడాల శోభాయాత్రలు ప్రతి ఉదయం ఆగకుండా, అలసిపోకుండా యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.

మాఘ మేళా సంప్రదాయాలను ఛేదించే తొలి ప్రయత్నాలు
కాలక్రమేణా, మిషనరీల బలం ప్రయాగ్రాజ్ మాఘ మేళాలో మరింత పెరిగింది. వారు తమ ప్రచారం కోసం.. పవిత్ర స్థలాన్ని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వారు మేళా జరిగే ప్రదేశంలో (సంగమం ఇసుకలో) స్థలం కోసం అడిగేవారు. ఇంకా తమ ప్రచారం కోసం శిబిరాలను (క్యాంపులు) ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు.

వారు క్రైస్తవ సాహిత్యాన్ని పంచడమే కాకుండా, హిందూ సంప్రదాయాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ప్రారంభించారు.

1880 డిసెంబర్ 30 న పాస్టర్ జాన్‌స్టన్, జాయింట్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాస్తూ.. తాము గత 40 సంవత్సరాలుగా (అంటే 1840 నుండి) మేళాలో స్థలం లభిస్తుందని పేర్కొన్నారు. 1882 జనవరి 2 న రాసిన మరో లేఖలో.. ఉర్దూ ఇంకా పర్షియన్ భాషలలో ఈ విషయం ధృవీకరించబడింది.

పాస్టర్ ఓవెన్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించారు. హిందువులను మతమార్పిడి చేసి, వారిని ‘దేశీ పాదరీల’గా తయారుచేసి, వారిని తిరిగి గ్రామాలకు పంపి మత ప్రచారం చేయించేవారు. గోపీనాథ్ నంది ఇందులో ప్రముఖుడు. ఎన్ని ప్రయత్నాలు, ప్రచారాలు జరిగినా, శంఖం శబ్దం, మంత్రాల ధ్వని మరియు భక్తుల ‘హర హర గంగే’ నినాదాలు.. మిషనరీల ప్రయత్నాలను అణచివేశాయి. భారతీయ నాగరికత మరియు ఆ సంప్రదాయం చెక్కుచెదరక, ఎలాంటి కదలిక లేకుండా.. తన మార్గంలో స్థిరంగా కొనసాగింది.

1857 : మేళాపై దాడిని తిప్పికొట్టిన సందర్భం
19వ శతాబ్దం మధ్య కాలంలో, మిషనరీలకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి రక్షణ లభించడం వలన ప్రజలలో తీవ్రమైన కోపం మరియు అసంతృప్తి పెరిగాయి. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాదు, అది సాంస్కృతిక తిరుగుబాటు కూడా. విప్లవకారులు.. మిషనరీలను వలస పాలన దౌర్జన్యంలో భాగంగా భావించారు. 1857 జూన్‌లో, ఆ విప్లవకారులు ప్రయాగ్ రాజ్ లోని అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ యొక్క ప్రింటింగ్ ప్రెస్‌ను సైతం తగలబెట్టారు. యూరోపియన్ మిషనరీలు భయపడి అలహాబాద్ కోటలో దాక్కున్నారు. ఆపై కలకత్తాకు పారిపోయారు.

దీని ఫలితంగా సుమారు 6 నుంచి 7 నెలల పాటు మిషనరీల కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. అయితే, ఆ నెలల్లో కూడా సాధువుల శిబిరాలు, యాత్రికుల యథావిధిగా స్నానాలు చేయడానికి వచ్చారు. ఇంకా మాఘ మేళా అదే శాంతి మరియు భక్తితో అంతే భక్తి శ్రద్ధలతో కొనసాగింది. నాగరికత మరోసారి దృఢంగా నిలబడింది.

20, 21 వ శతాబ్దం : రూపాలు మారినా, ప్రవృత్తి అదే
కాలం మారుతున్నా, మతమార్పిడి చేయించే వారి కుట్ర కొనసాగుతూనే ఉంది. వారి పద్ధతులు, రూపాలు మాత్రమే మారాయి. 2009లో విశ్వ హిందూ పరిషత్ (VHP) కార్యకర్తలు గంగా నదిని అవమానించే కరపత్రాలు పంచుతున్న నలుగురు క్రైస్తవ మిషనరీలను పట్టుకున్నారు. 2023 జనవరిలో.. ముగ్గురు ఇస్లామిక్ ప్రచారకులు (మౌల్వీ మహమూద్ హసన్ గాజీ, మహమ్మద్ మోనిష్, సమీర్) విదేశీ నిధులతో నడిచే ఇస్లామిక్ పుస్తకాలు పంచుతూ అరెస్టు అయ్యారు. నివేదికల ప్రకారం, నేటికీ ప్రయాగ్రాజ్‌లో 443 మిషనరీ బృందాలు చురుకుగా ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక సంఖ్య అని చెప్పవచ్చు.

ఎన్ని ప్రయత్నాలు జరిగినా.. ప్రతి సంవత్సరం మాఘ మేళా ప్రారంభం కాగానే, సంగమం మునుపటి కంటే అధికంగా లక్షలాది కాషాయ జెండాలు, సాధువుల శిబిరాలు మరియు అపారమైన భక్తులతో నిండిపోతుంది. ఏ ఏటికాయేడు.. భక్తుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు.

సవాళ్లపై విజయం సాధించిన నాగరికత
1840 నుండి 2025 వరకు (దాదాపు 185 సంవత్సరాలు), మిషనరీల వైపు నుండి అన్నీ ప్రయత్నించబడ్డాయి. ప్రింటింగ్ ప్రెస్‌ల ప్రచారం, విదేశీ నిధుల ఉపయోగం, మతమార్పిడి చెందిన పాదరీల ప్రచారం, బ్రిటిష్ ప్రభుత్వ మద్దతు, మేళాలో శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటి పద్దతులన్నీ ప్రయత్నించబడ్డాయి. మతమార్పిడి చేయించే శక్తులు మళ్లీ 1857 తర్వాత వచ్చాయి. 1900 లలో విస్తరించాయి. 2000లలో తమను తాము మళ్లీ వ్యవస్థీకరించుకున్నారు. అలా అవి నేటికీ చురుకుగా ఉన్నాయి.

కానీ మాఘ మరియు కుంభ మేళాలు, భారతదేశం యొక్క సజీవ నాగరిక స్మృతి (Living Civilisational Memory)గా, ఎప్పుడూ ఆగలేదు. సంగమం పవిత్రంగా ఉండిపోయింది. ఆచారాలు నిరంతరం కొనసాగాయి. ఇంకా సనాతన ధర్మ ప్రవాహం శతాబ్దాలుగా ఉన్నట్లే శక్తిమంతంగా ప్రవహిస్తోంది. మిషనరీ ప్రయత్నాలు కేవలం 200 సంవత్సరాలు మాత్రమే సాగాయి. సనాతన నాగరికత మాత్రం.. వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రతి శీతాకాలంలో, కోట్లాది మంది యాత్రికులు సంగమం వైపు కదులుతున్నప్పుడు, నిజంగా ఏ శక్తి అఖండంగా నిలిచిందో.. దేనిని ఎప్పటికీ తుడిచిపెట్టలేమో.. ఈ ప్రపంచం చూస్తుంది.