
శ్లో ॥ వైకుంఠ పద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ
ఉత్తర ద్వార గమనే, దేవస్య మధు విద్విషః
దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం॥
వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి (డిసెంబరు 30, మంగళవారం) వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి? దీని వెనుక ఉన్న పురాణ గాథలేంటో చూద్దాం..
శ్లో॥ ఉత్తర ద్వార మాసీనం ఖగస్థం వేంకటనాయకం|
యః పశ్యతి సభక్తాదౌ యాతివై పరమాం గతిమ్॥
వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడనీ, అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటుంటారు. పెరియాళ్వార్‌కి పరమాత్మ గరుడ వాహనారూఢుడై దర్శనమిచ్చిన రోజు కూడా ఈ వైకుంఠ ఏకాదశే. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం, అమృతం ఉద్భవించింది ఈ రోజునే.
శ్లో॥ జన్మరాహిత్య మమలం ప్రాప్నోతి సువినిశ్చితమ్|
గరుఢారూఢ విష్ణోస్తు సేవా మోక్షఫల ప్రదా||
ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఉత్తరద్వారం నుంచి వెళ్ళి ఖగరాజ వాహనం పైన కొలువుదీరిన మహావిష్ణువును దర్శించి సేవించడం వల్ల సమస్త పాపాలు నశించి జన్మరాహిత్యం సంప్రాప్తిస్తుందని విశ్వాసం. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.
పురాణ గాథలు ఇవీ.
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గలోకంలో ప్రవేశించారట. అలాగే, పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ‘ముర’ అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే. మురాసురుడి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువును శరణు కోరగా, ఆయన ఆ రాక్షసుడితో తలపడి సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును సంహరించేందుకు ముర ప్రయత్నించగా మహా విష్ణువు నుంచి ఆవిర్భవించిన వైష్ణవీ శక్తి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై తన కంటి చూపుతో మురను బూడిద చేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. తాను ఆవిర్భవించిన ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని భక్తితో సేవించిన వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. దీంతో పుష్య శుక్ల పక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. అప్పటినుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది.





