News

నసనకోటలో పురాతన శాసనం వెలుగులోకి

164views

శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోటలో గుర్తించిన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి సంగమవంశానికి చెందిన మొదటి బుక్కరాయల కాలం నాటి రాగి పలక శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి వెల్లడించారు. చరిత్ర అధ్యాపకుడు ప్రతాప్‌ ఆహ్వానం మేరకు పరిశోధకుడు శ్రీధర్‌తో కలసి మైనాస్వామి నసనకోటలో పర్యటించారు. 1352లో నసన గ్రామం, పరిసర గ్రామాలకు గౌడ, దేశిగౌడ అనే గ్రామాధికారులను నియమిస్తూ చక్రవర్తి బుక్కరాయలు రాగి పలక శాసనాన్ని రాయించారన్నారు. గుత్తిరాజ్యం పాలెజ స్థలం కనగానపల్లి పరిధి నసనగ్రామం గౌడగా చోడమరెడ్డిని రాజు నియమించారు. పేరూరు కొమర గుండు, బైరవతిప్ప, ముష్టికోవెల, వల్లూరు, వకజంక, కేతగానిచెర్ల, వరగెర, తిరుమణి, బల్ల సముద్రం తదితర గ్రామాలకు దేశి గౌడలను గ్రామాధికారులుగా పేర్కొంటూ వారందరికీ పెద్ద గౌడగా పెద్ద చోడమరెడ్డిని నియమించినట్లు శాసనం చెబుతోందని మైనాస్వామి తెలిపారు. పెన్నా నది పరిసర గ్రామాల భూముల దానం చేయడం, కాలువల ద్వారా పెన్నా నీటిని మళ్లించి వ్యవసాయ అభివృధ్ధికి విజయనగర పాలకులు ఎంతగానో పాటుపడినట్లు శాసనం తెలుపుతోందన్నారు.