News

హసీనా స్థానం నుంచి హిందూ నేత పోటీ..

149views

బంగ్లాదేశ్‌లో మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిధ్యం వహించిన గోపాల్‌గంజ్‌-3 స్థానం నుంచి ఓ హిందూ నేత పోటీకి సన్నద్ధమవుతున్నారు. న్యాయవాది అయిన గోవిందా చంద్ర ప్రామాణిక్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అక్కడ మైనార్టీలపై దాడులు జరుగుతున్న వేళ కీలక స్థానం నుంచి హిందూ వ్యక్తి పోటీలో దిగడం గమనార్హం.

బంగ్లాదేశ్‌ జాతీయ హిందూ మొహజోతే (హిందూ మహాకూటమి)లో కీలక సభ్యుడిగా ఉన్న గోవిందా ప్రామాణిక్‌.. తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు చెప్పారు. పార్టీల ఆదేశాలకు కట్టుబడి కొన్ని ప్రజా సమస్యలను ఎంపీలు లేవనెత్తలేరని, అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల తరఫున గళాన్ని వినిపించేందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్థానిక మీడియాతో పేర్కొన్నారు.

దేశంలో ప్రస్తుతం హిందూ జనాభా సుమారు 10శాతం ఉంటుందని.. మత మార్పిడులు, విదేశాలకు వలస వెళ్లడంతో ఈ జనాభా తగ్గిందని ప్రామాణిక్‌ చెబుతున్నారు. హిందువులపై పలు సందర్భాల్లో దాడులు జరిగాయని, అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. కానీ, ఇటీవల మైనార్టీలే లక్ష్యంగా అక్కడ మళ్లీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ కార్యకలాపాలపై నిషేధం ఉన్న కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేయడం కుదరదని తాత్కాలిక ప్రభుత్వం తాజాగా పేర్కొంది.