
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. మైనారిటీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్ ఉదంతం మరవకముందే మరో హిందూ వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌బరి జిల్లాలో రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా ‘డెయిలీ స్టార్’ పేర్కొంది. డబ్బు వసూళ్లకు పాల్పడడంతో గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు పేర్కొంటున్నారు.
రాజ్‌బర్ జిల్లా పంగ్షా సర్కిల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమృత్ మొండల్ (29) అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న సామ్రాట్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం వేకువజామున 2 గంటల సమయంలో మృతిచెందాడు. సామ్రాట్ అనుచరుల్లో ఒకడైన మొహ్మద్ సెలిమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఒక పిస్టల్, షూటర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలు, డబ్బులు వసూలు చేయడం కోసం ‘సామ్రాట్ బహిన్’ పేరిట సామ్రాట్ ఓ క్రిమినల్ గ్యాంగ్‌ను నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. ఒక హత్యానేరం సహా రెండు కేసులు అతడిపై ఉన్నాయని పేర్కొన్నారు. షేక్ హసీనా దేశం వీడిన తర్వాత సామ్రాట్ కొద్ది రోజులు అజ్ఞాతం గడిపాడని, ఇటీవలే గ్రామానికి తిరిగి చేరుకున్నాడని వెల్లడించారు. బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన షాహిదుల్ ఇస్లామ్ ఇంటికెళ్లి డబ్బు డిమాండ్ చేయడంతో, కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేశారని, దీంతో గ్రామస్థులు సామ్రాట్‌ను చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారని తెలిపారు. గ్యాంగ్‌లోని ఇతర అనుచరులు పారిపోయారని, మొహమ్మద్ ఒక్కడే తమకు చిక్కాడని పేర్కొన్నారు. దీపూ చంద్రదాస్‌పై దాడి తర్వాత ఓ మైనారిటీ వ్యక్తిపై మూకదాడి జరగడం ఈ ఘటనపై అనుమానాలకు తావిస్తోంది.





