News

బంగ్లాదేశ్‌లో హిందువు హత్య.. ఏడుగురి అరెస్టు

205views

ఇటీవల బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళనల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో 25 ఏళ్ల దీపూ చంద్రదాస్‌ అనే హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంపై యూనస్‌ ప్రభుత్వం స్పందించింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలనలో మూక దాడులకు చోటు లేదని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్‌ అల్లర్లపై దర్యాప్తు చేస్తోందన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు గతంలో ‘విద్యార్థుల ఉద్యమం’లో కీలక పాత్ర పోషించిన ఇంక్విలాబ్‌ మోంచో యువనేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అతడి మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లో ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో అక్కడ నివశిస్తున్న భారతీయులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆ దేశంలోని భారత హైకమిషన్‌ అక్కడి భారతీయులకు సూచించింది.

విషాదకరమైన ఘటన..
బంగ్లాదేశ్‌ అల్లర్లలో మైనార్టీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్‌ను హత్య చేయడం చాలా విషాదకర ఘటనగా శశిథరూర్‌ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా.. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

బంగ్లాలో ఉద్రిక్తతలు.. భారత్‌-బంగ్లా ఆర్మీ చీఫ్‌ల సంభాషణ!
బంగ్లాలో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్ వాకర్-ఉజ్-జమాన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా బంగ్లా ఆర్మీ చీఫ్‌ మాట్లాడుతూ.. తమ దేశంలోని అన్ని భారతీయ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయన్నారు. దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్నప్పటికీ ప్రజల భద్రతను కాపాడడానికి యూనస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.