NewsProgramms

ఘనంగా ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ వార్షికోత్సవం

645views

విజయవాడలోని కేదారేశ్వరపేటలోగల కృష్ణరాజ అపార్ట్మెంట్లో గల ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ వార్షికోత్సవం నేడు ఘనంగా జరిగింది. అలాగే తన నివాసం పదిమందికీ జ్ఞానాన్ని, జాతీయ భావాన్ని, దేశభక్తిని అందించే అధ్యయన కేంద్రం కావాలనే ప్రబలమైన ఆకాంక్షతో 2019 జనవరి 26న తన నివాసంలో ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ పేరుతో అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించి, తరువాతి రోజే అంటే జనవరి 27న తుది శ్వాస విడచిన స్వర్గీయ పిసిపాటి వెంకట శ్రీరామశాయి ప్రథమ వర్ధంతి కూడా ఈరోజు జరిగింది.
క్రిష్ణరాజ అపార్ట్మెంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించడంలో స్వర్గీయ శ్రీరామశాయికి అన్ని విధాలా సహకరించి, వారి లక్ష్య సాధనలో తోడు నీడగా నిలచిన ప్రముఖ రచయిత శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువతరంలో అధ్యయన శీలత తగ్గిపోతూ ఉన్నదని, దాని కారణంగా అనేక చారిత్రిక, రాజకీయ, సామాజిక అంశాలపై నేటి యువతకు అవగాహన కొరవడుతున్నదని స్వర్గీయ శ్రీరామశాయి గారు ఎప్పుడూ మధన పడుతూ ఉండేవారని చెప్పారు. ఆ కారణంగానే తామిద్దరం కళాశాలలకు వెళ్ళి పిల్లలకు వివిధ విషయాలపై అవగాహనా తరగతులను నిర్వహించేవారమని చెప్పారు. అనంతరం తన ఇంటినే అధ్యయన కేంద్రంగా మలచి నలుగురికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని స్వర్గీయ శ్రీరామశాయి సంకల్పించారని, అది మొదలుకుని తన ఆరోగ్యం సహకరించకపోయినా దాని స్థాపన కోసం అహోరాత్రాలు శ్రమించారని శ్రీ శ్రీనివాస రావు వివరించారు. నేడు వారి ఆకాంక్ష మేరకు ‘సెంటర్ ఫర్ ఇంటిగ్రల్ స్పిరిట్’ నడుస్తున్నదని, ఇది మరింతగా విస్తరించి మరింతమంది అధ్యయనానికి ఉపయోగపడాలని పేర్కొన్నారు.

అలాగే మరొక వక్త, ఆరోగ్య భారతి అఖిల భారత కార్యదర్శి డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీరామశాయి తాను ఏ పని స్వీకరించినా దాని సాఫల్యం కోసం అహరహమూ తపించే వాడని, ఏ పని స్వీకరించినా దానిని విజయవంతం చెయ్యగల సమర్ధుడని కొనియాడారు. స్వర్గీయ శ్రీరామశాయి ఎంతో గొప్ప స్నేహ శీలి అని ఆయన తనకున్న స్నేహాశీలత కారణంగా తన పనికి ఎవరి సహకారాన్నైనా పొందగాలిగేవాడని , సిద్ధాంత పరంగా తనతో విభేదించే వారితో కూడా స్నేహం చెయ్యగలగడం స్వర్గీయ శ్రీరామశాయి ప్రత్యేకత అని తెలిపారు. సమాజానికి అవసరమైన, అనుగుణ్యమైన వ్యవహార శైలిని, భాషని ఆయన కలిగి ఉండేవాడని డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమానికి స్వర్గీయ శ్రీరామశాయి పాత్రికేయ మిత్రుల తోపాటు, ఆయన సన్నిహితులు, బంధు మిత్రులు ఆ అపార్ట్మెంట్లో నివసించే ఇరుగుపొరుగు వారు పాల్గొని ఆయనతో తమకున్న బాంధవ్యాన్ని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.