ArticlesNews

ఏకాత్మ మానవతాదర్శనం మానవ జాతికి దిక్సూచి

236views

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రత్యేకం

మానవ హక్కులు ఆధునిక నాగరిక ప్రపంచానికి పునాది రాళ్లు వంటివి. విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన జరగక ముందు ప్రపంచం మొత్తం బానిసత్వం అమలులో ఉంది. మనిషిని మనిషిగా చూడలేని బానిస వర్తకం పేరుతో జరిగిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఐరోపా ఫ్యూడలిస్టులు అనాగరికులైన ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలను ఓడలలో కుక్కి గొలుసులతో బంధించి ఒక యజమాని నుంచి మరొక యజమానికి అమ్మేసేవారు. అలా కొనుగోలు చేసినవారితో వెట్టి చాకిరి చేయించేవారు. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో అంటే 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం ఏదో ఒక రూపంలో వివక్షతను ఎదుర్కొంటూ..బానిసత్వంలో మగ్గుతున్న మానవ జాతికి తొలి వెలుగుగా చెప్పవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు.

‘‘వ్యక్తిలో అంతర్గతంగా నిబిడీకృతమైన శక్తియుక్తుల ఆధారంగా చేసుకొని వ్యక్తులు ఉన్నతస్థాయిలో జీవించడానికి కల్పించబడిన సామాజిక అవకాశాలే మానవ హక్కులు’’ అంటాడు ప్రముఖ ఇంగ్లాండ్ రాజనీతిజ్ఞుడు జీ. లస్కి. అంటే పౌరుల సర్వతోముఖాభివృద్ధికి హక్కులు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపడం. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడడం. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాలు నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండడం, స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాలలో పర్యటించే హక్కు ఉండడం, సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు ఉండడం, బలవంతపు పనుల నుండి విముక్తి కలిగి ఉండడం, విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండడం, బావ ప్రకటన, స్వాతంత్ర్యపు హక్కు ఉండడం, ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు కలిగి ఉండడం ఇవన్నీ మానవహక్కుల ప్రధాన లక్ష్యాలు.

మన దేశ రాజ్యాంగంలో రాసుకున్న ప్రాథమిక హక్కులకు కూడా మానవ హక్కుల ప్రకటనే స్ఫూర్తి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ అధికరణ నుంచి 35వ అధికరణ వరకు మొత్తం ఆరు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. వీటికి న్యాయ స్థానాల నుంచి రక్షణ ఉండేలా రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం కల్పించారు. ఇవి పౌరులను రాజ్య నిరంకుశ చర్యల నుంచే కాకుండా తోటి మానవుల బాధ్యతారహిత చర్యల నుంచి కూడా కాపాడుతాయి. మానవుడి సర్వతోముఖాభివృద్ధికి ఇవి ఎంతో అవసరం కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేక రక్షణ కల్పించారు.

అసమానతలు తగ్గించి, సకల మానవ హక్కులతో, సమానత్వంతో జనజీవన స్రవంతిలో మమేకమై జీవించడమే మానవ హక్కుల దినోత్సవ ప్రధాన ఉద్దేశం. మానవ హక్కుల యొక్క ఉన్నత ఆదర్శాలు మన వేద సాహిత్యంలోని శ్లోకాలలో ప్రతిధ్వనిస్తాయి. అంతేకాదు, మానవ హక్కుల సమస్యకు పాశ్చాత్యేతర దృక్పథాన్ని అందిస్తాయి కూడా. మన వేదాలు మొత్తం సృష్టి యొక్క సర్వోత్కృష్టమైన ఏకత్వాన్ని నొక్కి చెబుతున్నాయి. ‘‘సర్వేపి సుఖిన:సంతు/ సర్వే సంతు నిరామయ:/ సర్వే భద్రాణి పశ్యస్తు/ మా కశ్చిద్ దు:ఖభాగ్ భవేత్.’’ అంటే అందరూ సంతోషంగా ఉండనివ్వండి, అందరు రోగాల నుండి విముక్తి పొందండి, అందరూ శుభకార్యాలను చూడనివ్వండి, ఎవరూ దు:ఖంతో బాధపడకండి. తైత్తరేయ ఉపనిషత్తులోని మరొక ప్రార్థన కూడా చాలా ముఖ్యమైనది. ‘‘ఓం సహనవవతు/ సహ నౌ భునక్తు/సహవీర్యం కరవవాహై/తేజస్వీ నవధితమస్తు/మా విద్వషావహై/ఓం శాంతి: శాంతి: శాంతి:’’, దీనర్థం ఏంటంటే ఆయన మనల్ని కలిసి రక్షిస్తాడు/ఆయన మనల్ని కలిసి పోషించగలడు/మనం ఎక్కువ శక్తితో కలిసి పని చేద్దాం/మన అధ్యయనం శక్తివంతంగా, ప్రభావవంతంగా ఉండనివ్వండి/మనం ఒకరినొకరు ద్వేషించకుండా ఉండనివ్వండి/అంతటా శాంతి నెలకొంటుంది.

మన సనాతన ధర్మం యొక్క ఆలోచనాపరులు మనిషికి అవసరమైన హామీలు, అలాగే అతడు కలిగి ఉండాల్సిన సద్గుణాలు ఏమిటో ప్రతిపాదించారు. హింస, కోరిక, దోపిడీ, అవమానం, వ్యాధి నుంచి విముక్తి ఇలా ఐదు సామాజిక స్వేచ్ఛలను ప్రతిపాదించారు. అలాగే ఐదు ధర్మాలను కూడా పాటించాలని ఉద్ఘాటించారు. సహనం, భూతదయ, జ్ఞానం, ఆలోచన, నిరాశ నుండి విముక్తి కలిగి ఉండాలని ఘోషించారు. వీటినే ధర్మాలుగా స్పష్టం చేశారు. మన వేద సాహిత్యం, ధర్మశాస్త్రాల వివరణలు సమకాలీన మానవ హక్కులకు సమానమైన సహజమైన హక్కుల ముఖ్యమైన ఆదర్శాలను వెల్లడిస్తున్నాయి. వేద గ్రంథాలలో పేర్కొన్నట్లుగా బాధ్యతలను మానవ హక్కుల యొక్క పరస్పర సంబంధాలుగా పరిగణించడం ద్వారా మానవ హక్కుల భావన మరింత బలపడుతుందనేది సుస్పష్టం. ‘‘భవిష్యత్తులో మానవ హక్కుల సంస్కృతిని ఏకీకృతం చేయడం మరియు నిలబెట్టుకోవడం’’ అనే నినాదంతో ఈ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మానవులు సర్వతోముఖాభివృద్ధి సాధించేల కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు పౌరులపై కూడా ఉంది. ఏకాత్మ మానవతావాదం యావత్ మానవజాతికి దిక్సూచి కావాలి.