News

విశాఖపట్నం ఆర్గానిక్ మేళాకు విశేష స్పందన

168views

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆరవ ఆర్గానిక్ మేళాకు జనం నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా శని ఆదివారాల్లో మేలా కిక్కిరిసిపోయింది. లక్షల్లో సందర్శకులు రాగా కోట్ల రూపాయల్లో వ్యాపారం జరిగింది. ముఖ్యంగా చివరి రోజు అయిన ఆదివారం విశేషస్పందన లభించింది. మేళా చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. కొనుగోలుదార్లతో మేళా ప్రాంగణం కిక్కిరిసింది.

నిత్యం రసాయన ఎరువులతో పండిం చిన ఆహారం తీసుకునే ప్రజలు ఆర్గానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. రసాయనాలు వినియోగించుకుండా పండించిన ప్రకృతి పంటలు తీసుకునేందుకు స్టాల్స్ ముందు బారులు తీరారు. దీంతో ఆర్గానిక్ ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రకృతి రైతులు ప్రదర్శించిన ఉత్పత్తులు ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 4 నుంచి 7 వరకు నిర్వహించిన మేళాకు వినియోగదారులు పెద్దఎత్తున పాల్గొని భారీగా విజయవంతం చేశారని నిర్వాహకుడైన భారత కిసాన్ సంఘ్ నేత జలగం కుమారస్వామి తెలిపారు.

మిద్దె తోటలు మరింత విస్తరించాలి
మేలాలో భాగంగా చివరి రోజైన ఆదివారం నాడు మిద్దె తోటలపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పర్యావరణవేత్త సేంద్రియ వ్యవసాయదారుడు విజయరామ్ మాట్లాడుతూ విశాఖ నగరంలో 400 ఎకరాల విస్తీర్ణంలో మిద్దె తోటలు ఉన్నాయని భవిష్యత్తులో వేల ఎకరాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వేల సంఖ్యలో మహిళలు విశాఖలో తమ ఇంటి మిద్దెలపై ఆకుకూరలు కాయగూరలు సేంద్రియ పద్ధతుల్లో పండించటం సంతోషదాయకమని పేర్కొన్నారు. సేంద్రియ ఆహారమే దేశ భవిష్యత్తు అని విషపూరిత ఆహారాలతో యువత నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖలో మిద్ద తోటలను ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ టెర్రస్ గార్డెనింగ్ లో సేంద్రియ ఎరువుల తయారీ అత్యంత కీలకమైనదని అన్నారు. సేంద్రియ ఎరువుల తయారీకి సంబంధించిన అంశాలపై పెంపకం దారులు మరింత దృష్టి సారించాలని కోరారు.

వారాహి రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు పేరు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజలను సేంద్రీయ ఆహారం వైపు చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. సేంద్రియ మేళాల నిర్వహణ ద్వారా అవగాహన పెరుగుతుందని ఇది రైతుల్లోకి కూడా మరింత విస్తృతంగా వెళ్లాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మిద్ద తోటల పెంపకంలో విశేష ప్రతిభ కనబరిచిన పలువురిని ఈ సందర్భంగా నిర్వాహకులు జ్ఞాపికలు అందించి సన్మానించారు.

ఉద్యానవన శాఖలు, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, హలో వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్లు, గ్రీన్ క్లైమేట్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.