ArticlesNews

స్వామి వివేకానంద బాటలో ఆర్ఎస్ఎస్

191views

1980లో తిరువేదగంలో స్వామి చిద్భావనానంద ఆర్ఎస్ఎస్ వార్షిక శిక్షణా శిబిరాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం.

ప్రియమైన యువకులురా! మీరంతా ఎంతో పుణ్యం చేసుకున్నవారు. హనుమంతుడికి లంకలోకి చొరబడే ముందు తన శక్తి ఏమిటో ఆయనకు తెలియదు. దాని గురించి ఆయనకు గుర్తు చేసిన తర్వాత సీతాదేవి ఒక్క లంకలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కనిపెట్టగలిగే శక్తి తనకు ఉందన్న సంగతిని ఆయన అవగతం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్టుగా మనం మనలోని పిరికితనాన్ని అధిగమించాలి. పెద్ద పెద్ద విషయాలు సాధించడానికి గొప్ప శక్తితో పూనుకోవాలి. మన దేశం ఈ యావత్ ప్రపంచంలో ఎంతో గొప్పది. భారతమాత బిడ్డలుగా మీరంతా భౌతిక, మానసిక శక్తిని, అత్యంత ఆధ్యాత్మికతను కలిగి ఉండాలి. ధైర్యవంతులైన మీరంతా గొప్ప గొప్ప పనులు చేయాలి. మనమంతా భౌతికంగానూ, భావజాలాలపరంగానూ ఐక్యతను అభ్యసించాలి. అనుసరించాలి. మనమంతా ఐక్యంగా ఉన్నపక్షంలో గొప్ప విషయాలను సాధించగలం. మనం చిన్న చిన్న కొబ్బరి తాళ్లను పెనవేయడం ద్వారా ఒక ఏనుగును బంధించడానికి అవసరమైన పెద్ద తాడులను చేయగలం. అదేవిధంగా, మనమంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు పెద్ద విషయాలను సాధించగలం.

ధైర్యం అంటే ఏమిటి? ఒకసారి ఒక వానరాల గుంపు స్వామి వివేకానంద వెంటపడ్డాయి. ఆయన ఒక్కసారి అగి నిలబడి వెనక్కి తిరిగి చూశారు. దాంతో ఆ వానరాలు పత్తాలేకుండా పారిపోయాయి. అదేవిధంగా మనమంతా అధర్మానికి వ్యతిరేకంగా ఐకమత్యంతో నిలబడాలి, అది ధర్మానికి దారి చూపుతుంది. అదే మనకు బలాన్ని తెచ్చిపెడుతుంది!

గత నెలరోజులుగా మనం అంతర్గతంగా ఎంత మానసిక శక్తిని అభివృద్ధి చేసుకున్నదీ మనకు తెలియదు. ఆంజనేయ స్వామి తన శక్తిని మరిచిపోయారు. అదే విషయాన్ని ఆయనకు గుర్తు చేసినప్పుడు ఆయన దానిని సరైన పద్ధతిలో వినియోగించుకున్నారు. భారతమాత బిడ్డలుగా మనం మన తల్లిదండ్రులను పూజించే పద్ధతిని అనుసరించాలి.

మనం ఇలా అనుసరించిన పద్ధతిని వాడుకుంటూ వారంలో కనీసం రెండు రోజులు సమాజం కోసం పనిచేయాలి. ప్రయోజనాలను పక్కన పెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అయాచితంగా మీరు చేసిన సేవకు ప్రయోజనాలను పొందుతారు. మంచి లక్షణాలను అభివృద్ధి చేసుకొని సమాజ అభ్యున్నతి కోసం పనిచేయండి.

ఆ పరమాత్ముడు మనందరిపైన ఆశీస్సుల వర్షం కురిపిస్తారు.

స్వామి చిద్భావనానంద శిక్షణ శిబిరంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు.

1. సంఘ్ కార్యకలాపాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
– మనం సంఘ్ ని స్వామి వివేకానంద సూత్రాలను అనుసరించే ఒక సంస్థగా చూడాలి.స్వామి వివేకానంద చెప్పినదాన్ని బట్టి బలం జీవితం, బలహీనత మృత్యువు. సంఘ్ స్వామి వివేకానంద స్వప్నాలను సాకారం చేస్తోంది. భౌతికపరమైన, మానసికపరమైన, జ్ఞానపరమైన శిక్షణ ఇవ్వడం ద్వారా మానవులను సృష్టిస్తోంది. అందుకనే తిరుపరైతురైలో గతంలోనూ ఇప్పుడూ వసతి సౌకర్యం సమకూర్చాం. ఆర్ఎస్ఎస్కు ఏ విధమైన సహాయం చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం.

2. రాజకీయ పార్టీలు హిందువులను ఏకం చేస్తున్నదంటూ ఆర్ఎస్ఎస్ గురించి దుష్ప్రచారం చేస్తున్న కారణంగా అనేక మంది మాతో స్వేచ్ఛగా సంచరించడానికి భయపడుతున్నారు. మేం వారిలో ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి?
– నిర్భయులు భయపడుతున్నవారికి అండగా నిలబడాలి. ఇక్కడ భయపడటానికి ఏమీ లేదు. ఆర్ఎస్ఎస్ దేశం బాగోగుల కోసం పనిచేస్తోంది. దీనిలో హానికరమైనది ఏదీ లేదు. అవివేకంలో నుంచి భయం పుడుతుంది. ఆర్ఎస్ఎస్ మీ జీవనశైలిని మార్చిన తీరు గురించి మీరు వివరించాలి. ఇది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. మీరు మీ జీవన శైలిని ప్రదర్శించడం మొదలు పెట్టినప్పుడు ప్రజలు దానిపట్ల ఆకర్షితులవుతారు. అలాంటి జీవనశైలి కోసం మీతో చేరుతారు. మీరు దేశం పట్ల నిర్వర్తించవలసిన కర్తవ్యం ఇదే. మీ సామాజిక సేవ మీ జీవన శైలిని ఇతరుల ఎదుట ప్రదర్శిస్తుంది. వ్యతిరేక వాదనలు సూర్యుడి ముందు పొగమంచులాగా కరిగి మాయమైపోతాయి. మీ సేవా సంకల్పం ఇతరులకు ఆదర్శనీయం కావాలి. మీరు సేవ చేస్తున్నప్పుడే మాత్రమే అన్ని రకాల అవరోధాలు అడ్డుగా నిలుస్తాయి. ఎలాంటి భయం లేకుండా తెగువతో పని చేయండి. మంచితనం ఎప్పటికీ దెబ్బతినదు. నిరాధారమైన అపవాదులు ఏదో ఒక రోజున ధ్వంసమైపోతాయి.

-‘RSS an Open Book Less Known Dimenstions’ నుంచి