ArticlesNews

‘పశు సేవ కూడా పశుపతి సేవే’

116views

అన్ని దానాల్లోకి అన్నదానం ఎంత గొప్పదో, అన్ని ధర్మాల్లోకి సేవా ధర్మం అంత గొప్పది. ‘మానవసేవే మాధవ సేవ’ అంటారు. దాంతో పాటు ‘పశు సేవ కూడా పశుపతి సేవే’ అనీ అనుకోవాలి.

పశు పక్ష్యాదుల్లోనూ దైవాన్ని చూసి, దేవుళ్ల వాహనాలుగా భావించి పూజలు చేసి తరించడం మన సంస్కృతిలో ఉంది. పండుగల్లోనూ ఇది కనిపిస్తుంది. కనుమ పండుగ ప్రత్యేకించి పశువుల సేవకు ఉద్దేశించిందే. గోవు మొదలుకుని శునకం వరకు దైవస్వరూపాలుగా భావించి పూజలు చేస్తాం. ఆదిదేవుడని మనం కొలిచే వినాయకునిలో ఏనుగు కనిపిస్తుంది. నరసింహస్వామిలో సింహం దర్శనమిస్తుంది. పాములంటే భయపడినా వాటిలో నాగేంద్రుణ్ని చూసి ఆరాధిస్తాం. పుట్టల్లో పాలు పోసి చల్లగా చూడమని దండం పెట్టుకుంటాం. సింహం కనకదుర్గమ్మకు, ఎలుక వినాయకుడికి వాహనాలని తలుస్తాం. కొలుస్తాం. సామాన్య జనంతో పాటు అసామాన్యులైన రాజాధిరాజుల వరకు తరతమ భేదం లేకుండా భూతదయ చూపడం పురాణేతిహాసాల్లో కూడా కనిపిస్తుంది.

ఒక మహారాజులోని పశుసేవా పరాయణత్వానికి మహాకవి కాళిదాసు రచించిన రఘువంశంలో చక్కటి దృష్టాంతం ఉంది. దిలీప మహారాజు ఒక ముని ఆశ్రమానికి వెళ్తాడు. మహర్షి దర్శనం కోసం వెళ్లే హడావుడిలో ఆయన ఆశ్రమం ముంగిట ఉన్న కామధేనువును పట్టించుకోలేదు. దాంతో కామధేనువు కినుక వహించింది. ఆ సంగతి దిలీపుడికి తెలియదు. మహారాజుకు ఎంత కాలమైనా సంతానం కలగక పోవడంతో దైవజ్ఞులను సంప్రదించాడు. కామధేనువును నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఆగ్రహించిందని దాని ఫలితమే ఇదని వారు వివరిస్తారు. కామధేనువు కరుణించి శాపవిముక్తి చేయాలంటారు. దాంతో మహారాజు హుటాహుటిన ముని ఆశ్రమానికి వెళ్లి కామధేనువు కాళ్లమీద పడతాడు. తనను క్షమించమని వేడుకుంటాడు.

కామధేనువు మనసు కరిగి తన పుత్రిక అయిన నందినీ ధేనువును సేవిస్తే శాపవిముక్తి జరుగుతుందని సెలవిస్తుంది. దాంతో దిలీపుడంతటి మహారాజు భార్యతో కలిసి రోజంతా నందినీ ధేనువును కంటికి రెప్పలా చూసుకుంటాడు. ముందు మహారాజు వెనక మహారాణి ఉంటే మధ్యలో ఉన్న నందినీ ధేనువు పగటికి రాత్రికి మధ్య సంధ్యా సమయంలాగా విరాజిల్లిందని కాళిదాసు అద్భుతంగా వర్ణిస్తాడు. నందినీ ధేనువును అనుసరిస్తూ దిలీపుడు అడవికి కూడా వెళ్తాడు. అక్కడ నందిని నిలబడితే నిలబడుతూ, కదిలితే కదులుతూ, అది నీళ్లు తాగితే తానూ తాగుతూ మహారాజు నీడ లాగా అనుసరిస్తున్నాడని కవి వర్ణిస్తాడు. అదే సమయంలో దిలీపుడు పలు పరీక్షలను ఎదుర్కొంటాడు. నందినీ ధేనువును కాపాడటానికి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడతాడు. ఇదంతా గ్రహించిన కామధేనువు దిలీపుణ్ని అనుగ్రహించి శాపవిముక్తుణ్ని చేస్తుంది. కథ సుఖాంతమవుతుంది.

మన పురాణాల్లో ఇలాంటి కథలు ఎన్నెన్నో. అన్నిటిలోనూ అంతస్సూత్రం ఒక్కటే- మనుషులు సాటి మనుషులకే కాదు, మూగజీవాలైన పశు పక్ష్యాదులకు సైతం హాని తలపెట్టకూడదని చెప్పడం.