
కృష్ణాజిల్లాలో ఆధ్యాత్మిక పరంపరకు పేరుగాంచిన మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నవంబర్ 13న జరిగిన ఈ మహోత్సవంలో 35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట 3,900 మంది భక్తులు కలిసి కోటి దీపాలను వెలిగించి భక్తి ఘనతను చాటుకున్నారు. ఒక్కోసారి లక్ష వత్తుల చొప్పున దీపారాధన నిర్వహించడం ఈ వేడుక ప్రత్యేకతగా నిలిచింది. భక్తులతో కళకళలాడిన ఈ సందర్బం ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనమై, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారికంగా ఈకార్యక్రమాన్ని రికార్డుగా నమోదు చేసింది.
ఈ మేరకు రికార్డు గుర్తింపు పత్రాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డా. చింతపట్ల వేంకటా చారి స్వయంగా దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ దేసు నీరజకి, అందజేశారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు కొర్రపాటి గోపిచంద్ మాట్లాడుతూ, మచిలీపట్నం చారిత్రక దేవాలయాలకు నిలయం అని, నూతన కమిటీ కొద్ది రోజుల్లోనే వినూత్న రికార్డు సాధించడం అభినందనీయం అని పేర్కొన్నారు.“35 అడుగుల పరమశివుడి విగ్రహం ఎదుట వేలాది మంది కలిసి కోటి దీపారాధన చేయడం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం. కూలంకుషంగా పరిశీలించి ఈ రికార్డును అందజేస్తున్నాము. భవిష్యత్తులో దేవస్థానం మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నాంది పలకాలనుకుంటున్నాము” అని తెలిపారు.





