News

మీ పిల్లలకు మంచి వ్యక్తిత్వం కావాలా? – ఈ అలవాట్లే పునాదులట!

160views

ఉదయం మన మూడ్‌ ఎలా ఉంటే, రోజంతా అదే విధంగా కొనసాగుతుంటుంది. అందుకే, లేచిన సమయం చాలా ప్రశాంతంగా ఉండాలంటారు. పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుందట. ప్రశాంతమైన ఉదయం వారిని ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. అందుకే, ఉదయం వేళ చిన్నారులకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే చాలు, వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయని చెబుతున్నారు. అలాగే, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, ఉత్పాదకత, సానుకూలత పెరుగుతాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పిల్లలకు ఉదయాన్నే ఎలాంటి అలవాట్లు నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం!

నిద్ర లేవడం : పిల్లలు ఆలస్యంగా నిద్రపోతే ఉదయం లేవడానికి బద్ధకిస్తారు. స్కూల్‌కి వెళ్లే సమయానికి హడావిడిగా రెడీ అవుతారు. దీంతో వారిలో ఒత్తిడి, గందరగోళం మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వారు రోజంతా ఇబ్బందిపడతారని అంటున్నారు. అలా కాకూడదంటే, పిల్లల్ని రాత్రి తొందరగా నిద్ర పుచ్చాలని సూచిస్తున్నారు. ఉదయం తొందరగా నిద్ర లేచేలా చూడాలని పేర్కొంటున్నారు. అప్పుడు వారికి ఉదయం వేల బోలెడు సమయం ఉంటుందని, ఏ కంగారూ లేకుండా ప్రశాంతంగా, నింపాదిగా స్కూల్‌కి రెడీ అవ్వొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిద్ర లేస్తున్న సమయాన్ని 15-20 నిమిషాలు క్రమంగా తగ్గిస్తూ తొందరగా లేచేలా అలవాటు చేయాలని సలహా ఇస్తున్నారు.

మంచం సర్దడం : ఏదైనా విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరు. అది ఉదయాన్నే దక్కితే ఇంకెంత బాగుంటుందో కదా! అదే చిన్నారులకు అలవాటు చేయాలంటున్నారు నిపుణులు. లేవగానే మంచం సర్దడం నేర్పించాలని చెబుతున్నారు. అది పూర్తయ్యాక వారిని ప్రశంసిస్తే సంతోషపడతారని పేర్కొంటున్నారు. ఉదయం తొందరగా లేవడంతో సమయం ఉంటుంది కాబట్టి, చిన్న చిన్న పనులు వారితో చేయించామని సూచిస్తున్నారు. దుప్పట్లు, దిండ్లు సర్దించడం, మొక్కలకు నీరు పోయడం, ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులు అప్పగించడం ద్వారా బాధ్యత తీసుకోవడం కూడా అలవాటవుతుందని తెలియజేస్తున్నారు.

బ్రేక్‌ఫాస్ట్‌ : చాలామంది చిన్నారులు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ వద్దని మొండికేస్తారు. కానీ, వారికి బ్రేక్‌ఫాస్ట్‌ తినడం తప్పనిసరిగా అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం శరీరానికి శక్తి కావాలంటే అల్పాహారం తినాలని వారికి అర్థమయ్యేలా చెప్పాలంటున్నారు. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ని కాకుండా శరీరానికి శక్తిని, పోషకాలను అందించే ధాన్యాలు, మొలకలు, పండ్లు, ఓట్స్‌ వంటివే అల్పాహారంగా తినడం అలవాటు చేయాలని పేర్కొంటున్నారు. కుటుంబంతో కలిసి తింటే ఆరోగ్యంతోపాటు అనుంబంధాలూ బలపడతాయని వెల్లడిస్తున్నారు.

ఉదయాన్నే గ్లాసు నీళ్లు : రాత్రంతా నిద్రలో ఉండటం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గే అవకాశం ఉంటుంది. శరీరం డీహైడ్రేట్‌ అవడం వల్ల చర్మం పొడిబారడం సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. అందుకే, లేవగానే బెడ్‌కాఫీ, టీ వంటివి కాకుండా, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేయాలని చెబుతున్నారు. ఉదయాన్నే నీరు తాగితే శరీరం ఉత్తేజితమవుతుందని, జీర్ణక్రియ మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. అలాగే, చర్మం తాజాగా ఉండటంతోపాటు కాలకృత్యాలు సజావుగా సాగుతాయని పేర్కొంటున్నారు. కేవలం నీరు తాగడం ఇష్టం లేకపోతే నిమ్మరసం, కీరా ముక్కలు నీళ్లలో వేసి తాగడం వంటివి కూడా రుచిని, మంచి ఫలితాలనిస్తాయని సలహా ఇస్తున్నారు.

రెడీ అవడం : ఉద్యోగం చేసే తల్లిదండ్రులు ఉంటే, పిల్లలను స్కూల్‌కు రెడీ చేయడం చాలా పెద్ద టాస్క్‌. సమయాభావం వల్ల ఇబ్బంది పడుతుంటారు. అందుకే, పిల్లలకు వారి వ్యక్తిగత పనులు వారే చేసుకునేలా చూడాలంటున్నారు నిపుణులు. లేచాక బ్రష్‌ చేసుకోవడం, స్నానం చేయడం, దుస్తులు ధరించడం, జట్టు దువ్వుకోవడం వంటివి స్వతంత్రంగా వారినే చేసుకోమనాలని సూచిస్తున్నారు. ఇవి వారిలో తమ పని తామే చేసుకోవాలనే బాధ్యత ఏర్పడడంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని పేర్కొంటున్నారు.

వ్యాయామం : ఆరోగ్యంగా, శరీరం దృఢంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి చేయాలి. చిన్నారులకు ఉదయం కాసేపు వ్యాయామం చేయడం అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి కఠినమైన వ్యాయామాలు కాకుండా, స్ట్రెచింగ్‌, యోగా, స్కిప్పింగ్‌, స్టెప్పింగ్‌ ఇలా తేలికపాటి వ్యాయామాలు చేయించాలంటున్నారు. దీంతో శరీరం ఉత్తేజితమవుతుందని, రక్త ప్రసరణ మెరుగవుతుందని తెలియజేస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయిస్తే, కొన్ని రోజులకు అది వారికి వదలలేని అలవాటుగా మారిపోతుందని వివరిస్తున్నారు.

కృతజ్ఞతాభావం అలవాటు చేయాలి : రోజును పిల్లలు సానుకూల దృక్పథంతో ప్రారంభించేలా చేయాలి. ‘నేను శక్తిమంతుడిని’, ‘ఇచ్చిన పనుల్ని సక్రమంగా చేయగలను’, ‘ఈ రోజు గొప్పగా ఉండబోతుంది’ ఇలా సానుకూలమైన వాక్యాలను వారితో చెప్పించాలంటున్నారు నిపుణులు. లేదంటే వారికి సంతోషాన్ని కలిగించిన విషయంలో కృతజ్ఞత తెలపమని కోరాలని చెబుతున్నారు. ఎలాగంటే, తనకు సాయం చేసిన మిత్రుడికి, అండగా ఉన్న కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పే అలవాటు చేయాలని వివరిస్తున్నారు. ఇవి పిల్లల్లో శాంతిని, స్థిరత్వాన్ని మరింత అభివృద్ధి చేస్తాయని పేర్కొంటున్నారు.

పుస్తక పఠనం : స్కూల్‌లో కేవలం అకడమిక్‌ పాఠ్యాంశాలే చెబుతారు. జీవిత పాఠాలు స్వతహాగా నేర్చుకోవాలి. అందుకే, ఉదయం పూట స్కూల్‌ పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే, స్ఫూర్తి నింపే పుస్తకాలను చదివించడం అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయా పుస్తకాల్లో నచ్చిన అంశాల గురించి చర్చించమని చెప్పాలంటున్నారు. అవి వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.