News

పరిశోధన రంగంలో భారత్‌ సత్తా చాటుతోంది : ప్రధాని మోదీ

187views

పరిశోధన రంగంలో భారత్‌ దూసుకుపోతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. మన్‌ కీ బాత్‌ 128వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ప్రధాని.. మన యువత అసమాన శక్తి, బలమైన సంకల్పంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని పేర్కొన్నారు.

గత 11 ఏళ్లలో విజ్ఞానం, క్రీడలు, సామాజిక సేవ, సంస్కృతి వంటి వివిధ రంగాల్లో యువత అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రధాని ప్రశంసించారు. కష్టతరమైన వాటిని కూడా భారత్‌ సాధిస్తోందని చెప్పారు. అంధుల మహిళా క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచి చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా వంటి సంస్కరణలతో భారత యువత వికసిత్‌ భారత్‌ కలను సాకారం చేస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.

కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలోని ఓ వీడియో తన దృష్టిని ఆకర్షించిందని ప్రధాని చెప్పారు. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా రూపొందించిన చోట డ్రోన్లను ఎగరవేయడానికి మన యువత ప్రయత్నించారని అన్నారు. జీపీఎస్‌ మద్దతు లేక డ్రోన్‌లు నేలకూలుతున్నప్పటికీ.. పుణెకు చెందిన విద్యార్థుల బృందం పట్టుదలతో పలుమార్లు యత్నించి డ్రోన్లు కొంత సమయం ఎగిరేలా చేసినట్లు వెల్లడించారు. యువతలో ఉన్న ఇలాంటి గొప్ప సంకల్ప బలమే దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చేందుకు తోడ్పడుతుందన్నారు.