
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ శుక్రవారం గోవాలో ఆవిష్కరించారు. దక్షిణ గోవా జిల్లాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు.మఠం 550వ వార్షికోత్సవ వేడుకలు (శార్ద పంచశతామానోత్సవం)లో భాగంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది.
రామాయణ థీమ్ పార్క్ ప్రారంభం
కేవలం విగ్రహావిష్కరణే కాకుండా, రామాయణ థీమ్ పార్క్‌ను కూడా మోదీ ప్రారంభించారు. ఈ పార్క్‌ను మఠం ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. రామాయణ ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలను కళా రూపాలు, ఇన్‌స్టాలేషన్ల ద్వారా ప్రదర్శించేలా ఈ థీమ్ పార్క్‌ను రూపొందించారు. ఈ పవిత్ర సందర్భానికి గుర్తుగా, ప్రధానమంత్రి ఒక ప్రత్యేక పోస్టల్ స్లాంప్, ఒక స్మారక నాణెం విడుదల చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని మఠం కమిటీ చైర్మన్ శ్రీనివాస్ డెంపో చెప్పారు. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ రూపశిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని మలిచారని తెలిపారు. మఠం ఏర్పాటై 550 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారన్నారు.





