News

దివిసీమలో పొందిన ప్రేరణ మరువలేనిది : బండారు దత్తాత్రేయ

233views

దివిసీమ నా కర్మభూమి అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు, 1977 దివిసీమ ఉప్పెన 48 సంవత్సరాల సంస్మరణ సభ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బండారు దత్తాత్రేయ ఉప్పెన నాటి చిత్రాలతో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన దత్తాత్రేయ ఉప్పెన సమయంలో తాను సేవ చేసిన నాటి ఫోటోలు చూసి మురిసిపోయారు.

గాంధీక్షేత్రంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దివిసీమ గ్రామాల్లో ఉప్పెన సమయంలో చేసిన సేవల జ్ఞాపకాలు తన హృదయానికి దగ్గరగా ఉంటాయన్నారు. పర్రచివర, దిండి, సొర్లగొంది, మూలపాలెం, కోడూరు గ్రామాల్లో తాము సేవ చేసిన జ్ఞాపకాలు ఇంకా తన మదిలో మెదలుతూనే ఉన్నాయన్నారు. దివిసీమలో సహాయక చర్యల కోసం ఆరు నెలలు గడిపిన కాలం తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చిందన్నారు. దివిసీమలో పొందిన ప్రేరణ మరువలేనిదన్నారు. దివిసీమ ఉప్పెనకు సహాయక చర్యలకు తాము వచ్చినప్పుడు పదివేల మంది మృతి చెంది ఎటు చూసినా కొట్టుకుపోయిన గ్రామాలు, కుప్పలుగా శవాలు చూసి తమ వంతు కర్తవ్యంగా సామూహిక శవ దహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నీతి నిజాయితీలతో నైతిక విలువలు పాటిస్తూ జీవించిన గాంధేయవాది కృష్ణారావు అన్నారు. తండ్రి బాటలోనే గాంధేయవాదిగా బుద్ధప్రసాద్ చేస్తున్న కృషి అపూర్వమన్నారు. ప్రస్తుత పాలకులు అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తీర గ్రామాల మత్స్యకారులకు సమాచారం ఇవ్వటంతో పాటు, రహదారులు, కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1977 నవంబర్ 19న సంభవించిన ఉప్పెనకు 84 గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా, రూ.172 కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు తెలిపారు. దివిసీమ పునర్నిర్మాణం, అభివృద్ధికి నాడు మండలి వెంకట కృష్ణారావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషి అపూర్వమన్నారు. బుద్ధప్రసాద్ కృషితో చంద్రబాబు పులిగడ్డ – పెనుమూడి బ్రిడ్జి నిర్మించి దివిసీమకు కనెక్టివిటీ ఏర్పాటు చేశారన్నారు.

జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిఘా సంస్థ మాజీ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి ప్రసంగిస్తూ దివిసీమలో తుఫాన్ షెల్టర్ల నిర్మాణానికి, రోడ్ల అభివృద్ధికి ప్రకృతి వైపరీత్యాల తాను చేసిన కృషిని వివరించారు.

రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శితి కంఠానంద మహరాజ్ మాట్లాడుతూ 1977 నవంబర్ 19న వచ్చిన ఉప్పెన స్వాతంత్య్రం వచ్చిన తరువాత వచ్చిన విపత్తుల్లో పెద్ద విపత్తు అన్నారు.