
ఫరీదాబాద్‌లో భద్రతాధికారులు నిర్వహించిన ఆపరేషన్‌లో ఉగ్ర కుట్రల్లో భాగమైనవారు వైద్యులని తేలడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ టెర్రర్ మాడ్యూల్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారిని అధికారులు గుర్తించారు. అతడే ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్.
జమ్మూకశ్మీర్ పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్టు చేశారు. అతడి గురించి ఆరాతీయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇర్ఫాన్‌ది జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ ప్రాంతం. వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గతంలో అతడు శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పని చేశాడు. నౌగామ్‌లోని ఓ మసీదులో కలిసిన విద్యార్థులతో సంబంధాలు కొనసాగించాడు. పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొందిన ఇర్ఫాన్.. ఫరీదాబాద్‌లోని వైద్య విద్యార్థులకు ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసినట్లు తెలుస్తోంది. జైషేకు సంబంధించిన వీడియోలను పదేపదే విద్యార్థులకు చూపించినట్లు సమాచారం. ఇంటర్నెట్ కాల్స్‌తో అఫ్గానిస్థాన్‌లోని కొంతమందితో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద భావజాలాన్ని విద్యార్థుల్లో అణువణువునా నింపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
డాక్టర్ ముజమ్మిల్, ఉమర్‌లు ఈ మిషన్‌లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మాడ్యూల్‌ను ఇర్ఫాన్ రూపొందించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మాడ్యూల్ బయటపడిన నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ దిల్లీ పేలుడుకు కారణమైనట్లు తెలుస్తోంది. ఉమర్‌కు ఇర్ఫాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇక, ఇటీవల అరెస్టయిన డాక్టర్ షాహిన్ ఈ మాడ్యూల్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.




