
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ సమావేశాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సందర్భంగా సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే గురుతేగ్ బహదూర్ ను స్మరించుకున్నారు. భారతీయ పరంపరలో ఆయనో మెరిసే నక్షత్రమని అభివర్ణించారు.గురుతేగ్ బహదూర్ 350 వ స్ఫూర్తిదాయకమైన బలిదానం రోజున, వివిధ మత సామాజిక సంస్థలు దేశంలో గౌరవం, భక్తి ప్రపత్తులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని అన్నారు.
సంఘర్షణ కాలంలో దేశంలోని చాలా భాగం విదేశీ పాలకుడు ఔరంగజేబు క్రూరమైన దురాగతాలకు బలయ్యాయని, మన దేశం, సంస్కృతిని, విశ్వాసాలను నాశనం చేయడానికి బలవంతపు మత మార్పిళ్లు జరిగాయన్నారు. దీంతో పండిత కృపరామ్ దత్ జీ నాయకత్వంలో సమావేశమై, తమకు మార్గదర్శనం చేయాలని శ్రీగురు తేగ్ బహదూర్ దగ్గరికి వచ్చారన్నారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న తేజ్ బహదూర్.. సమాజం కోసం జీవితాలను త్యాగం చేయాలని సూచించారన్నారు.
దీంతో ఔరంగజేబు కి ఇబ్బందులు ప్రారంభమయ్యాయని, మత ఛాందస ప్రభుత్వం అతడ్ని అరెస్ట్ చేసి, ఇస్లాం స్వీకరించాలని, లేదంటే మరణ శిక్షే అంటూ బెదిరింపులకు దిగిందని, అయినా.. అదర బెదర కుండా గురు తేగ్ బహదూర్ వారికి లొంగిపోకుండా ఆత్మ బలిదానమయ్యారని గుర్తు చేశారు.శ్రీ గురు తేగ్ బహదూర్ జీ సంకల్పం మరియు ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో, మొఘల్ సుల్తానేట్ ఆయన శిష్యులైన భాయ్ దయాళ (వేడి నూనెలో కుండలో మరిగించడం ద్వారా), భాయ్ సతిదాస్ (నూనెలో పత్తిని చుట్టి సజీవ దహనం చేయడం ద్వారా) మరియు భాయ్ మతిదాస్ (రంపడం ద్వారా)లను దారుణంగా హత్య చేశారన్నారు.
అతని బలిదానం సమాజంలో మత రక్షణ కోసం పూర్తి త్యాగం మరియు పోరాట వాతావరణాన్ని సృష్టించింది, ఇది మొఘల్ శక్తి పునాదులను కదిలించిందని హోసబళే పేర్కొన్నారు. ఆయన జీవితంలో సమాజంలో మత విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, సమాజ సంక్షేమం కోసం అంకితమయ్యారన్నారు. మెరుగైన జీవితం కోసం మానవులు ఆనందం-దుఃఖం, ప్రశంస-నింద, గౌరవం-అవమానం, దురాశ-ఆసక్తి, కామం-కోపం లేని జీవితాన్ని గడపాలని బోధించారన్నారు.
భారతీయ సంప్రదాయంలో శ్రీ గురుతేగ్ బహదూర్ ఓ నక్షత్రం వంటి వారని, వారి బోధనలను, త్యాగ ప్రాముఖ్యాన్ని ప్రతి ఇంటికీ వ్యాప్తి చేయడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని హోసబళే అన్నారు.ఆయన ఆశయాలను, మార్గదర్శకత్వాన్ని ఆలంబనగా చేసుకొని జీవితాలను నిర్మించుకోవాలని, సంఘ కార్య శతాబ్ది సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తితో పాల్గొనాలని స్వయంసేవకులకు, యావత్ సమాజానికి హోసబళే పిలుపునిచ్చారు.





