News

100 వసంతాల ప్రవాహం సంఘ గంగ : లు పివిఎన్ మాధవ్

174views

అనంతపురం జి ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, గోపాల్ రావు ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్, రాయలసీమ రాజకీయ రుషి డి.సూర్యప్రకాశ రెడ్డి ex.mlc,పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఆర్ ఎస్ ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ యుగంధర్ జి, డాక్టర్ వడ్డి విజయ సారధి, గోపాల్ రావు ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ సత్యమూర్తి, లక్ష్మీదేవి, అనంతపురం విభాగ్ సంఘచాలక్ హిమకర్ గారు పుస్తకావిష్కరణ చేశారు.

100 వసంతాల ప్రవాహం సంఘ గంగ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్
100 వసంతాల ప్రవాహం సంఘ గంగ అని ఎందరో ఋషులు మునులు తాపసులు ఈ కార్యాన్ని ముందుకు నడిపిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఆర్ ఎస్ ఎస్ అనంతపురం మరియు శ్రీ గోపాలరావు ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈశ్వరార్చన భావనతో ఆదర్శవంతమైన అందుకు దేవి రెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి ఒక నిదర్శనం అన్నారు. సూర్య ప్రకాశ్ రెడ్డి ని రాయలసీమ గాంధీగా పిలుచుకుంటారు. తన తండ్రి పీవీ చలపతిరావుతో డీఎస్పీ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉండేది అన్నారు. మా తండ్రి రెండుసార్లు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి డీఎస్పీ రెడ్డి సహకారం ఉందన్నారు. ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేశారని, శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించకపోవడాన్ని ఎన్టీఆర్ ను నిలదీశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ రెండో మారు ముఖ్యమంత్రి అయ్యాక డీఎస్పీ రెడ్డి సూచనను పరిగణలోకి తీసుకొని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారన్నారు. డీఎస్పీ రెడ్డి మొత్తం మూడు మార్లు ఎమ్మెల్సీగా గెలిచారని అందులో ఎమర్జెన్సీ తర్వాత జైలులో ఉండి ఎమ్మెల్సీ అయ్యారని రాయలసీమ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని పార్టీలు డీఎస్పీ రెడ్డి ఎమ్మెల్సీ కావడానికి సహకరించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పారన్నారు. అటల్ బిహారీ వాజ్పాయ్, ఎల్ కె అద్వానీ లాంటి వారిని ఒప్పించి రాష్ట్రపతి కావడానికి తన వంతు ప్రయత్నం చేశారని తదనంతర కాలంలో కాంగ్రెస్తో చేతులు కలిపి జనతా పార్టీ విచ్చిన్నానికి నీలం సంజీవరెడ్డి కారకులు అయ్యారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అనంతపురం జిల్లాలోనే అత్యధిక సత్యాగ్రహాలు జరిగాయి అన్నారు. కలియుగం బద్ధకంతో కూడిందని, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తాను నిలబడి ధర్మాన్ని నిలబెట్టాడన్నారు. డీఎస్పీ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో సంఘ విస్తృతి కోసం బాగా కృషి చేశారని, ఒక స్వయంసేవక్ రాజకీయాలలోకి వస్తే ఎంతటి ఆదర్శవంతంగా ఉండాలో చేసి చూపించారన్నారు. అందుకే అలాంటి వ్యక్తిని వరుసగా మూడుసార్లు ఎమ్మెల్సీ పదవి వరించిందని కొనియాడారు. విశాఖపట్నంలో వేదుల సత్యనారాయణ మూర్తి సంజయ్ గాంధీకి వ్యతిరేకంగా నినదించారని ఆ తర్వాత 19 నెలలు జైలు జీవితం గడిపారని, వేదుల సత్యనారాయణ మూర్తి వైద్య వృత్తిలో ఉచితంగా రోగులకు సేవలు అందించారన్నారు. స్వయంసేవకుడైన ప్రతి వ్యక్తి సమాజాన్ని గురించే ఆలోచిస్తాడని స్వార్థ బుద్ధితో వ్యవహరించడని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఈనాటి వక్త రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు యుగంధర్ జి మాట్లాడుతూ డాక్టర్ హెడ్గేగేవార్ 1925 లో హిందూ ఐక్యత కోసం స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం 100 ఏళ్ళు పూర్తి చేసుకుని , నేడు విశ్వవ్యాప్తమైందన్నారు. ఒకనాడు క్షేత్ర సంఘచాలక్ గా ఉన్న చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆదర్శవంతమైన జీవితాన్ని వివరించారు. స్వయంసేవక్ జీవితంలో చివరి దశలో ఉన్న దేశభక్తి మరచిపోడు అనే ఉదంతాన్ని చిలుకూరి వారు ఒక చక్కటి ఉదాహరణ అన్నారు. దేశవ్యాప్తంగా 3,000 మంది ప్రచారకులు సంఘానికి ఉన్నారని, లక్షలాదిమంది గృహస్తు కార్యకర్తలతో సంఘం బలపడిందని, అనంతపురం నగరంలో డిఎస్పి రెడ్డి ఒక అజాతశత్రువు అని అందుకే అతనిని అన్ని పార్టీల వారు అభిమానించే వారన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ వేరైనా డీఎస్పీ రెడ్డిని తన గురువుగా చెప్పుకునే వారన్నారు. దేశవ్యాప్తంగా సంఘంలో 1,60,000 ప్రాజెక్టులు నడుస్తున్నాయని, అన్ని దేశభక్తితో కూడి సేవాభావంతో పనిచేస్తాయన్నారు. ఆంగ్లేయులు సంఘాన్ని నిషేధించాలని, అదే బాటలో కాంగ్రెస్ పార్టీ పయనించిందన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంఘం దేశ సేవను మానలేదన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ వడ్డి విజయ సారథి మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి వచ్చిన స్వయంసేవకులు మన రాష్ట్రంలో సంఘ శాఖలు ప్రారంభించారని, దత్తోపంత్ బంధిస్టే, గోపాల్ రావు ఠాకూర్, వంటి ప్రముఖులు తెలుగు ప్రాంతాలలో సంఘ వ్యాప్తికి కృషి చేశారన్నారు. వి ఎల్ దేశ్ ముఖ్ విజయవాడ పరిసర ప్రాంతాలలో, నరసింహం, ఎండి వై రామమూర్తి వంటి వారు సంఘ శాఖల వ్యాప్తికి కృషి చేశారన్నారు. విజయ సారథి డీఎస్పీ రెడ్డి తో కలిసి నాలుగు నెలలు ఎమర్జెన్సీ సమయంలో ఒకే జైలులో ఉన్నారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డీఎస్పీ రెడ్డి కోడలు లక్ష్మీదేవి, గోపాల్ రావు ఠాకూర్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ సత్యమూర్తి, అనంతపురం విభాగ్ సంఘచాలక్ హిమకర్ జీ వేదికపై ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ జేష్ట కార్యకర్తలు, భాజపా కార్యకర్తలు, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా పాల్గొన్నారు.