
దేశానికి పొలిటికల్ ఇస్లామ్ పెను ప్రమాదమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఈ ముప్పుతో మన పూర్వీకులు పోరాడారని అన్నారు. అయితే దాని గురించి అంతగా చర్చ జరగలేదని చెప్పుకొచ్చారు. చరిత్రలో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసదారుల ప్రస్తావన ఉన్నప్పటికీ పొలిటికల్ ఇస్లామ్‌పై ప్రస్తావన చాలా తక్కువని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాల్లో సీఎం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా వంటి వీరులు పొలిటికల్ ఇస్లామ్‌పై కీలక పోరాటం సాగించారని గుర్తు చేశారు. అయితే ఆ కోణాన్ని చరిత్ర పెద్దగా పట్టించుకోలేదన్నారు.
దేశాన్ని విడగొట్టేందుకే..
పొలిటికల్ ఇస్లామ్ ద్వారా దేశాన్ని విడగొట్టేందుకు చంగూర్ బాబా వంటి శక్తులను ఉపయోగించుకుంటారని, అలాంటి శక్తుల నుంచి రక్షించేందుకు సమాజాన్ని ఏకం చేసే కృషిని ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న ప్రయత్నాలు ప్రశంసార్హమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.





