
అసోం ప్రభుత్వం లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. నాగోన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దీంతో పాటు అనేక చారిత్రక కొత్త బిల్లులు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
బిల్లు డ్రాఫ్ట్‌లను కేబినెట్ ఆమోదించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. “ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టనున్నాం. లవ్ జిహాద్, బహుభార్యత్వం లాంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాం. ఈ బిల్లులను సభలో పెట్టి చర్చిస్తాం. డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్ ఆమోదం అనంతరం మీడియాకు వివరిస్తాం” అని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అట్టడుగు వర్గాలకు న్యాయం, సాధికారతను నిర్ధారిస్తూ, అస్సాం సామాజిక, సాంస్కృతిక నిర్మాణాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవలో భాగంగా ప్రతిపాదిత బిల్లులను తీసుకువస్తున్నామని చెప్పారు. లవ్ జిహాద్, బహుభార్యత్వం వంటి వాటిని అడ్డుకునేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు.
లవ్ జిహాద్‌కు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే చట్టాలను తీసుకువస్తున్నట్లు గతేడాది సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. బలవంతపు మత మార్పిళ్ల ద్వారా వివాహం చేసుకోవడాన్ని అడ్డుకునేందుకు చట్టాలు అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పటికే బహుభార్యత్వంపై అసోం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఇది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. కొన్ని మతాలు రెండో పెళ్లికి అనుమతి ఇస్తాయని, అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వివరించింది. అంతకుముందు చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది అసోం ప్రభుత్వం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దాదాపు 3వేల మందికి పైగా అరెస్టు చేసింది.





