News

పీఎం సూర్యఘర్‌లో.. ఎస్సీ, ఎస్టీలకు 16వేల యూనిట్లు

166views

వినియోగదారుల విద్యుత్తు బిల్లులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ‘పీఎం సూర్యఘర్‌’కు శ్రీకారం చుట్టింది. ఇంటి పైకప్పుపై సౌరపలకలు ఏర్పాటు చేసుకునే ఓసీ, బీసీ సర్వీసుదారులకు రాయితీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు వాటిని ఉచితంగా అమర్చుతోంది. చిత్తూరు జిల్లాలో తొలుత ఎస్సీ, ఎస్టీ సర్వీసుదారులకు 16 వేల సౌరశక్తి యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించింది. ఇళ్ల పైకప్పులపై సౌరపలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుదుత్పత్తి చేసి సొంతానికి వాడుకునేలా అవకాశమిచ్చి, మిగిలింది గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. ఒకసారి పలకలు ఏర్పాటు చేసుకుంటే 25ఏళ్ల పాటు విద్యుత్తు పొందే అవకాశముంది. ఈ పథకంపై ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నుంచి అంగీకారపత్రాలను సేకరించేందుకు విద్యుత్తు శాఖ పనులు వేగవంతం చేసింది.

25వేల మంది ఎస్సీ, ఎస్టీల ఆసక్తి

పీఎం సూర్యఘర్‌కు చిత్తూరు జిల్లా నుంచి 25 వేల మంది ఎస్సీ, ఎస్టీ సర్వీసుదారులు ఆసక్తి చూపుతూ అంగీకారపత్రాలను అందజేశారు. పీఎం-సూర్యఘర్, ముఫ్త్‌ బిజిలీ యోజన కింద విద్యుత్తు శాఖ, నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకుంటే 15-20 రోజుల్లోనే ఉచితంగా రెండు కిలోవాట్లు ఉత్పత్తి చేసే సౌరపలకలు అమర్చుతారు. ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీలు, ఇతరులు విద్యుత్తు శాఖ అధికారులను సంప్రదిస్తే పథకం వివరాలను తెలియజేస్తారని జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు.

చిత్తూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహ సర్వీసుల వివరాలివి..

మొత్తం సర్వీసులు: 84,150
అంగీకారపత్రాలు అందజేసినవారు: 26,200