News

ఆలయ నిధులు స్వాహా

146views

అధికారం అండగా ఆలయ నిధులను అడ్డగోలుగా దోచేశారు..పూజలు చేసినట్లు..కల్యాణం నిర్వహించినట్లు..గుమస్తాలకు వేతనాలు చెల్లించినట్లు..రంగులు వేయించినట్లు కనికట్టు చేసి రూ.కోట్ల సొమ్ము కైంకర్యం చేశారు. బిల్లులు, వోచర్లు లేకుండా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిధులు వెచ్చించారు. 2019 నుంచి 2024 మధ్య వైకాపా హయాంలో మందడం గ్రూపు ఆలయాల కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన సత్యనారాయణరెడ్డి నిర్వాకం ఇది. ఈవో అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ బృందాన్ని నియమించి సమగ్ర నివేదిక కోరింది. రూ.2.28 కోట్ల సొమ్ము దుర్వినియోగమైనట్లు బృందం నిర్ధారించింది. సత్యనారాయణరెడ్డి ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ఆలయ ఈవోగా పనిచేస్తున్నారు.

బిల్లులు లేకుండానే..

మందడం గ్రూపు ఆలయాల పరిధిలో మందడం, తుళ్లూరు, ఐనవోలు, వెలగపూడి, రాయపూడి తదితర గ్రామాల్లో ఆలయాలు ఉన్నాయి. వీటికి రంగులు వేయించినట్లు, పూజలు చేసినట్లు, అన్నదానం నిర్వహించినట్లు ఖర్చులు రాసి పెద్దమొత్తంలో దోచేశారు. బిల్లులు, వోచర్లు లేకపోవడంతోపాటు బడ్జెట్‌కు మించి ఖర్చు చేయడం గమనార్హం. ఏడు ఆలయాల పరిధిలో రూ.60,94,934 దుర్వినియోగం అయినట్లు విచారణలో గుర్తించారు. తుళ్లూరు పరిధిలో మొత్తం 8 ఆలయాలు ఉండగా రూ.56,42,616 పక్కదారి పట్టినట్లు తేల్చారు. రాయపూడి, బోరుపాలెం, దొండపాడు, నేలపాడు గ్రామాల్లో 8 ఆలయాల్లో రూ.60,78,909 దోచేశారు. నెక్కల్లులో మూడు ఆలయాల్లో రూ.50,53,582 సొమ్ము చేతివాటం చూపారు. మందడం గ్రూపు ఆలయాల పరిధిలో మొత్తం రూ.2,28,70,041 దేవుడి సొమ్ము స్వాహా చేసినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. ఈవో సత్యనారాయణరెడ్డిపై దేవాదాయశాఖ అధికారులు విచారణ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ బృందం 192 అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేసినట్లు నివేదిక సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు, సంబంధిత దస్త్రాల పరిశీలన, ఆధారాలు గుర్తించడం, అర్చకులు, ఆలయ ఉద్యోగుల విచారణలన్నీ పూర్తిచేసి సమగ్రంగా నివేదిక రూపొందించింది. విచారణ సమయంలో ఆయా అంశాలకు సంబంధించిన చిత్రాలు సైతం సేకరించింది.

నివేదిక పంపి నాలుగు నెలలైనా..

ఆలయ అధికారి సత్యనారాయణరెడ్డి అక్రమాలపై నివేదికను ఈఏడాది జూన్‌ నెలలోనే దేవాదాయ ఉన్నతాధికారులకు గుంటూరు జోన్‌ ఉప కమిషనర్‌ పంపారు. అయితే నాలుగు నెలలవుతున్నా ఇప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. తీవ్రమైన అక్రమాలకు పాల్పడి రూ.2.28 కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు విచారణ బృందం నిర్ధారించినా చర్యలు తీసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారుల వైపు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంపై దేవాదాయశాఖలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.