ArticlesNews

పుణ్యప్రదం కార్తిక మాసం

208views

( అక్టోబర్ 22 – కార్తిక మాసం ప్రారంభం )

కార్తిక మాసం అనగానే భక్తి భావన కలుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తికమాసంలో నదీ స్నానంతో పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో పురాణాలు వినడం, చదవటం పుణ్యప్రదం. కార్తిక ఉపవాసాలతో మనసు, శరీరం పునీతమై ఆధ్యాత్మిక రహస్యాలు బోధపడతాయి. పాపకర్మలు చేసే వారికి కోటి దీపాలు వెలిగించినా జీవితంలో వెలుగు ఉండదు, గంగా స్నానం కూడా సత్ఫలితాలను ఇవ్వదన్నది ఆర్యోక్తి. ఆధ్యాత్మికమాసమైన కార్తికమాసం ఈ అవగాహనను పెంచుతుంది. కార్తిక వ్రతాలు, పూజలు దైవానికి దగ్గర చేస్తాయి. ఈ మాసంలో ఉదయానే నదీస్నానం, రెండు పూటలా దీపం వెలిగించటం, పురాణ శ్రవణం, సామూహిక వనభోజనం.. మొదలైనవన్నీ ఆధ్యాత్మిక చింతనను వృద్ధిచేస్తాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

కార్తికమాసంలో శివకేశవులను ఒకే రూపంగా భావించి పూజిస్తారు. మనలో చాలామందిమి భోగభాగ్యాల వ్యామోహం అనే అంధకారంలో పడి అపురూపమైన మానవజన్మను వృథా చేసుకోవడం సాధారణం. అలాంటి అజ్ఞానం నుంచి బయటపడే అవకాశం కల్పిస్తుంది కార్తికమాసం. ఈ మాసంలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపదర్శనం అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది. కార్తిక పౌర్ణమి పుణ్యదినాన నదీస్నానం చేసినప్పుడు కృత్తికా నక్షత్ర కాంతి శరీరంపై పడి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా మానసిక రుగ్మతలు ఉపశమిస్తాయి. దీపం వెలుగుతో శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. దీపజ్యోతి చెడు ఆలోచనలను నాశనం చేస్తుంది. కీర్తిని, జ్ఞానాన్ని అందిస్తుంది. ఆవునేతితో వెలిగించే కార్తికదీపం సర్వశుభాలనూ ప్రాప్తింపచేస్తుంది. ఆకాశంలో కార్తికదీపాన్ని ఉంచడం వల్ల పితృదేవతలు తృప్తిచెందుతారు, అది పుణ్య లోకాలకు దారి చూపుతుంది- అని పురాణాలు తెలియజేస్తున్నాయి. ధ్వజస్థంభానికి కార్తికదీపాలను వేలాడదీసి.. లక్ష్మీనారాయణులకు హారతి ఇస్తున్నట్టుగా భావిస్తారు.

దీపారాధన చేయడం వల్ల దేవతలు పరమ ప్రీతినొందుతారు. సకల విజయాలూ చేకూరతాయి. ప్రతినిత్యం దీపం వెలిగించాలి. కారణాంతరాల వల్ల ఒక్కోసారి విఘ్నం కలిగితే.. దాన్ని భర్తీ చేసేందుకు కార్తిక పౌర్ణమి రోజున మూడొందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం ఆనవాయితీ.

న కార్తిక సమా మాసో న కృతేన సమం యుగమ్‌
న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్‌

కార్తిక మాసానికి సమానమైన మరో మాసం, సత్య యుగానికి తులతూగే వేరొక యుగం లేవు. వేదాలకు సమానమైన శాస్త్రం కానీ, గంగానదికి సాటి వచ్చే నది కానీ లేవన్నది ఈ శ్లోక భావన. అంత పవిత్రమైన కార్తికమాసంలో గంగాస్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించినవారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది- అన్నది పురాణ వచనం.