
( అక్టోబరు 18 – విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి )
సామాజిక స్పృహతో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్ధ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. అటువంటి గొప్ప గుణాలు, ధర్మాలు కలిగిన అతి కొద్ది మంది రచయితలలో ఒకరు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. సమాజ జీవన పరిస్థితులను నిర్మొహమాటంగా వివరిస్తూ, వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు 1895 సంవత్సరంలో సెప్టెంబర్ 10 వ తేదీన, నేటి కృష్ణా జిల్లాలోని గుడివాడకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందమూరు గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విశ్వనాథ గారికి వారి తండ్రిగారైన శోభనాద్రి గారే ఆదర్శం. ఆయనలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు బాల్యం నుండే మన సత్యనారాయణ గారికి కూడా వచ్చాయి. ఆ విషయాన్ని విశ్వనాథ గారు తన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ లో స్వయంగా తన తండ్రిగారి గురించి ప్రస్తావిస్తూ సెలవిచ్చారు. ఆయన మొట్టమొదటి రచనా ప్రక్రియ 1916 లో ‘విశ్వేశ్వర శతకము’ తో మొదలై నాలుగేళ్ళలో తెలుగు భాషావేత్తల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు ఎప్పుడూ పాఠకుల స్థాయికి అనుగుణంగా రచనలు చేసి వారి మెప్పు పొందాలని తపన పడలేదు. పైపెచ్చు అసలైన సాహితీ విలువలను జొప్పించి, ప్రజలకు నిజమైన సాహితీ చైతన్యాన్ని రుచిచూపించాలని, కొంత వరకైనా భాషాసాహిత్యాన్ని ఉన్నత స్థితికి లాగాలని తపన పడ్డారు. కనుకనే ఆయన రచనలలో ఒక విశిష్టమైన శైలి కనిపిస్తుంది. సాహితీ సముద్రంలో విశ్వనాధునికి ముందు, విశ్వనాధుని తరువాత అనే విధంగా తన పాండిత్య పటిమతో సమాజంలో పెను సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టారు. ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ విశ్వనాథ గారు తెలుగులో రచించిన మొట్ట మొదటి పద్యకావ్యం. ఎన్నో ఖండ కావ్యాలు, చిన్న కథలు, కిన్నెరసాని పాటలు ఇలా ఒకటేమిటి ఆయన చేయని ప్రయోగాలు లేవు. వ్రాయని సామాజిక అంశాలు లేవు. కనుకనే జ్ఞానపీఠ పురస్కారం అందుకొన్న మొట్టమొదటి తెలుగువాడిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు పద్మభూషణ్ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్లు ఇలా ఒకటేమిటి లెక్కకు మించిన గౌరవాలు ఆయన శ్రేష్ఠ కావ్య ప్రతిభకు సరైన తార్కాణాలు.
విశ్వనాథ రచనల్లో స్త్రీ పాత్రలు వివేకవంతంగానూ, జ్ఞానవంతంగానూ, సంస్కార పూరితంగానూ చైతన్యంతో నిండి ఉంటాయి. అర్ధాంగి పట్ల అంతులేని ప్రేమ ఆయన రాతల్లో కనిపిస్తుంది. మాస్వామి శతకం, శాకుంతలం, విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, దమయంతీ స్వయంవరం, స్నేహఫలం, వీరపూజ వంటి రచనలు ఆయన జ్ఞానానికి, విజ్ఞానానికి అద్దం పడతాయి. భారత సంస్కృతికి సంబంధించిన సరైన కాల నిర్ణయం నేపథ్యంగా, మహా భాగవతంలోని భవిష్యత్ పురాణం ఆధారంగా కొనసాగిన అపూర్వ స్రవంతి-మహాభారత యుద్ధం ముగిసిన కాలం నుంచి శాలివాహన చక్రవర్తి వరకూ- పన్నెండు నవలల పురాణ వైరి గ్రంథమాల నిజంగా రసవత్తరం, విజ్ఞానదాయకం.
ఇక ఆధునిక భారత చరిత్రనంతా అన్యాపదేశంగా చెప్పిన గొప్ప నవల ‘సముద్రపు దిబ్బ.’ సుతిమెత్తని అనురాగాలు, అనుబంధాలతో, విధి విలాసపు విషాద నవల ఏకవీర. పరాయి పాలనతో వెన్ను విరిగిన వైనాలను కళ్లకు కట్టిన నవల వేయి పడగలు. ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి వంటి తెలుగువారు రొమ్ము విరుచుకుని చెప్పుకునే పద్యకావ్యాలు, నర్తనశాల, వేనరాజు, అనార్కలి వంటి విభిన్న నాటకాలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్లి వంటి తీయని అచ్చ తెనుగు పాటల మూటలు తెలుగువారు మరచిపోలేనివి. ఆర్ష సంప్రదాయ విలువలను తన సాహిత్యంలో మేళవించి భారతీయ సాహిత్య ప్రమాణాలను నిలబెట్టారు. తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని పదిలపరచుకొని, పదితరాల వరకు కావలిసిన తెలుగు వాఙ్మయాన్ని, అభ్యుదయ కవులకు, సంప్రదాయ కవి శ్రేష్ఠులకు ఎంతో స్ఫూర్తిని అందించిన ఈ మహనీయుడు అక్టోబరు 18, 1976న భగవంతునిలో ఐక్యమయ్యారు. ఆ అద్భుత ప్రతిభాశాలి నడిచిన సాహితీసేవా మార్గంలో నేటి యువత చిత్తశుద్ధితో అడుగులు వేయాలని ఆశిద్దాం.





