News

ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం ఆపాలని దాఖలైన పిల్‌ డిస్మిస్

4views

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం విషయంలో శుభవార్త అందిందని ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు బుధవారం కొట్టివేసిందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ పరిణామంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, ఆకివీడులో రామాలయ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కొందరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ పిల్‌ను ముగిస్తున్నట్లు (డిస్పోజ్ ఆఫ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ పిల్‌పై ప్రత్యేకంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకోర్టు నిర్ణయంపై స్పందించిన రఘురామ, ” రాష్ట్ర హైకోర్టులో మన ఆకివీడు రామాలయ పునర్నిర్మాణం ఆపాలని దాఖలైన పిల్‌ను డిస్మిస్ చేశారు. మన రామాలయం తరఫున అద్భుతంగా వాదనలు వినిపించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది వై.వి. రవి ప్రసాద్ గారికి రామాలయ సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. హైకోర్టు తాజా ఆదేశాలతో రామాలయ నిర్మాణానికి ఉన్న ఒక అడ్డంకి తొలగిపోయినట్లయింది.