
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. తన కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు.
నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివసేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హర హర మహాదేవ అంటూ ప్రధానమంత్రి గారికి ఘన స్వాగతం పలికారు.
దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గార్లకు విభూతి, కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు.

అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతి, మంత్రపుష్పాలతో భక్తిశ్రద్ధలతో దర్శనం చేశారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి, అర్చకులచే స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు.
ఆ తర్వాత ప్రధానమంత్రి గారు శ్రీ భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రమునకు ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి, షోడశోపచార పూజలు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు.

తరువాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను ప్రధానమంత్రి గారికి సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు మరియు శేష వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి అందజేశారు.

స్వామి, అమ్మవార్ల దర్శనం పూర్తయ్యాక శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శించారు. అక్కడున్న శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.





