News

పాకిస్థాన్‌పై దాడి ద్వారా తాము అనుకున్నది సాధించాం : అఫ్గానిస్థాన్‌

150views

పాకిస్థాన్‌పై దాడి ద్వారా తాము అనుకున్నది సాధించామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. అయితే సౌదీ అరేబియా, ఖతార్‌ తదితర గల్ఫ్‌ దేశాల అభ్యర్థన మేరకు దాడుల్ని నిలిపివేశామని అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ వెల్లడించారు. సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ పాల్పడిన దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగా మాత్రమే తాము దాడి చేశామని స్పష్టంచేశారు. యుద్ధం ఆగిపోవాలని మా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలు కోరాయని, దానికి తాము అంగీకరించామని చెప్పారు. ‘‘యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాబోదని మేం నమ్ముతున్నాం. సంప్రదింపులు, దౌత్యమార్గాల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం. ఇకపై కూడా మేం ఇదే విధానాన్ని అవలంబిస్తాం’’ అని చెప్పారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లు తమ సమస్యల్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని, సంయమనం పాటించాలని చైనా కోరింది.

మూతపడిన సరిహద్దు
పెషావర్‌: అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి స్తంభించిపోయిన ద్వైపాక్షిక వాణిజ్యం ఎప్పుడు ప్రారంభమయ్యేదీ తెలియలేదు. నైరుతి పాకిస్థాన్‌లోని చమన్‌ సరిహద్దును కొద్దిసేపు తెరచి 1,500 మంది అఫ్గాన్‌ జాతీయులు తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు వీలు కల్పించామని పాకిస్థాన్‌ అధికారి వెల్లడించారు. ఆగ్నేయ ప్రాంతంలో సరిహద్దులు మాత్రం సోమవారం కూడా మూసి ఉంచారు. సరిహద్దుల వద్ద వందల మంది చిక్కుకుపోయారని అధికార వర్గాలు తెలిపాయి. తాము జరిపిన దాడిలో 58 మంది పాకిస్థానీ సైనికులు మరణించారని ప్రకటించాయి. దాడుల్లో తమ సైనికులు 23 మంది మాత్రమే మృతి చెందారని, తాము జరిపిన ప్రతిదాడిలో 200 మంది తాలిబన్‌ అనుబంధ ఉగ్రవాదులు మరణించారని పాక్‌ సైన్యం ప్రకటించింది.