
గుడిలో గంటను మూడుసార్లు ఎందుకు మోగించాలనే సందేహం కొందరికి వస్తుంటుంది. పురాణ కథను అనుసరించి.. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని కలిసేందుకు వెళ్లాడు. వాళ్లు అనేక ధార్మిక విషయాలు చర్చించుకున్నారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ప్రశాంతత ఎలా చేకూరుతుందని అడిగాడు. ‘బాహ్య శాంతి కంటే అంతర్గత శాంతి చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం అంతర్గత శాంతిని పెంపొందించుకోవడమే. ఇక అశాంతి అనేది మూడు విధాలుగా సంప్రాప్తిస్తుంది.
ఒకటి ఆధిభౌతికం. అంటే జీవులకు సంబంధించింది. రెండోది ఆధిదైవికం. అంటే కంటికి కనిపించని శక్తులకి సంబంధించింది. మూడోది ఆధ్యాత్మికం. అంటే ఆత్మకు సంబంధించింది. ఈ మూడు రకాల అశాంతులను దూరం చేసుకుని పూర్ణ శాంతిని పొందాలి. అది గుడిలో గంటానాదం వల్ల సాధ్యమవుతుంది. ఇంట్లో పూజామందిరంలోనూ గంటను మోగించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గంటను మూడు సార్లు మోగించాలి. ఆ సమయంలో ‘ఓం శాంతి.. శాంతి.. శాంతిః’ అని స్మరించాలి. తొలిసారి గంటానాదం వల్ల దేహశాంతి, రెండోసారి వచ్చే శబ్దంతో మానసిక శాంతి, మూడోసారి వచ్చే ధ్వనితో ఆత్మకు శాంతి చేకూరతాయి’ అంటూ వివరించాడు వశిష్ఠ మహర్షి.





