News

మదర్సా టాయ్ లెట్ లో బంధించబడ్డ మైనర్ బాలికలు

202views

లక్నోలోని బహ్రైచ్ జిల్లాలోని మదర్సాకి సంబంధించిన దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. పహల్వారా గ్రామంలో గుర్తింపు లేని మదర్సా టాయిలెట్ లో 40 మంది మైనర్ బాలికలను బంధించారు. మదర్సాలో చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పదే పదే తమకు ఫిర్యాదులు అందాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో తనిఖీలు నిర్వహించామని, ఈ సమయంలోనే టాయిలెట్ లో బంధించిన మైనర్ బాలికలను గుర్తించినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పేర్కొన్నారు.

తనిఖీల సమయంలో మొదట ప్రతిఘటన ఎదురైంది. కానీ.. అధికారులు పోలీసుల సహాయంతో పై అంతస్థుకి కూడా వెళ్లారు. టెర్రస్ మీద ఉన్న టాయిలెట్ తలుపును మహిళా పోలీసులు తెరిచినప్పుడు, అమ్మాయిలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. వారు భయపడి స్పష్టంగా మాట్లాడలేకపోయారు’’ అని అధికారులు ప్రకటించారు.

ఈ మదర్సా దాదాపు మూడు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్లు తేలిందని మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ఖలీద్ ప్రకటించారు. చట్టబద్ధతను నిరూపించే ఏ పత్రాలను కూడా మదర్సా బాధ్యులు చూపించలేకపోయారని, తప్పించుకున్నారని మండిపడ్డారు.మదర్సాలో ఎనిమిది గదులు ఉన్నప్పటికీ బాలికలు టాయిలెట్‌లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించినప్పుడు, గొడవ సమయంలో పిల్లలు భయాందోళనకు గురై లోపల తాళం వేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మదర్సాను మూసేయాలని అధికారులు ఆదేశించారు. బాలికలను సురక్షితంగా ఇంటికి పంపిచేయాలని కూడా ఆదేశించాయని, వారి కుటుంబీకులు కూడా చేరుకున్నారని తెలిపారు. అయితే ఇంత జరిగినా.. పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సంక్షేమ అధికారి ఫిర్యాదు చేస్తే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.