News

ప్రపంచంలో హిందువులెక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయాలు

164views

ప్రపంచవ్యాప్తంగా హిందువులెక్కడ ఉంటే అక్కడ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడన్నారు. చిన్నప్పటినుంచి కూడా ఆయన దగ్గరే, ఆయన్ను చూస్తూనే పెరిగానని, ఏ కష్టం వచ్చినా. ఆయన మీద భారం వేసి ముందుకు సాగానని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వేల ఆలయాలు నిర్మించాలని టిటిడి ఉన్నతాధికారులకు ఆయన సూచించారు.

తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరై పట్టువస్త్రాలు సమర్పించాక.. రంగనాయకుల మండపంలో శ్రీవారి భక్తులనుద్దేశించి మాట్లాడారు.. ‘శ్రీవారి దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి. దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి. ప్రపంచంలో హిందువులెక్కడ ఉంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా కొన్ని కమిటీలు వేసుకొని అక్కడ ఉండే వాళ్లతో ఎప్పటికప్పుడు మాట్లాడి ప్రపంచం మొత్తం వేంకటేశ్వరస్వామి దేవాలయాల్ని నెలకొల్పేలా మీరు (తితిదే ఉన్నతాధికారులు) చేయాల్సిన ఉంది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్టుకు రూ.2,038 కోట్లు వచ్చాయి. రూ.837 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా రూ.1,700 కోట్లు ఉంది. ఒక ఐదు వేల ఆలయాలను గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు వేంకటేశ్వరస్వామిని కొలిచే భాగ్యాన్ని మనం కల్పించాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.